హైదరాబాద్, సాక్షి: ప్రజాభవన్ రోడ్డు ప్రమాద కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్‌స్పెక్టర్ దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడు(ఏ11). బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను దుర్గారావే తప్పించినట్లు అభియోగం నమోదు అయ్యింది. ఈ వ్యవహారంపై గతంలోనే నగర కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి దుర్గారావును సస్పెండ్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే.. విచారణకు హాజరు కాకుండా ఆయన పారిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజాగా.. గుంతకల్లు రైల్వే పోలీసుల సాయంతో దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్‌వాహె, నిజామాబాద్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్‌ను పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
డిసెంబర్ 23న అర్ధరాత్రి షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సాహిల్‌ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్‌ను పంజాగుట్ట ఠాణాకు పంపి కేసు నమోదు చేయించారు. ఇందుకు అప్పటి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment