durgarao
-
పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: ప్రజాభవన్ రోడ్డు ప్రమాద కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. గుంతకల్లు రైల్వే స్టేషన్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడు(ఏ11). బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను దుర్గారావే తప్పించినట్లు అభియోగం నమోదు అయ్యింది. ఈ వ్యవహారంపై గతంలోనే నగర కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి దుర్గారావును సస్పెండ్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే.. విచారణకు హాజరు కాకుండా ఆయన పారిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా.. గుంతకల్లు రైల్వే పోలీసుల సాయంతో దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు అబ్దుల్‌వాహె, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్‌ను పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 23న అర్ధరాత్రి షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సాహిల్‌ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్‌ను పంజాగుట్ట ఠాణాకు పంపి కేసు నమోదు చేయించారు. ఇందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. -
వృక్షాలపై ఔరా చిత్రకళా ‘కాండము’లు
కంచిలి (శ్రీకాకుళం): వృక్షాలే ఆయన కాన్వాస్. చెట్ల కాండలు కనిపిస్తే ఆయన తన మెదడుకు పదును పెడతాడు.. అద్భుతమైన బొమ్మ దింపేస్తాడు. ఆ విధంగా వృక్షాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు శ్రీకాకుళం జిల్లా కంచిలికి చెందిన ఉపాధ్యాయుడు గొర్లె దుర్గారావు. తన రెగ్యులర్ విధులతోపాటు, తనకిష్టమైన చిత్రకళ సరికొత్త పద్ధతుల్లో ప్రదర్శిస్తున్నారు. కంచిలిలో ఏపీ బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలలో ఆర్ట్స్ టీచర్‌గా గొర్లె దుర్గారావు విధులు నిర్వర్తిస్తున్నాడు. వృక్ష కాండములో కళాఖండాలు సృష్టించడం ఆయన ప్రత్యేకత. గురుకుల విద్యాలయ ఆవరణలో తిత్లీ తుఫాను వలన చెట్లు కూలిపోయాయి. ఈ సమయంలో ఒక టేకు చెట్టు పాఠశాల ఆవరణలో ఉండిపోయింది. పలుచగా.. పెద్ద సైజులో ఆ వృక్షం కాండం ఉండడంతో దుర్గారావు దానిపై తన కళను ప్రదర్శించాలని అనుకున్నాడు. ఈ విధంగా ఆ వృక్షంపై వీలు చిక్కినప్పుడల్లా వివిధ దేవతామూర్తుల ఆకారాలను చెక్కడం ప్రారంభించారు. ఈ విధంగా చెక్కుతూ ఇప్పటికీ 7 ప్రతిమలను చెక్కారు. గౌతమబుద్ధుడు, రాధాకృష్ణులు, వినాయకుడు, పరశురాముడు, వరాహావతారం, మత్య్సావతారం, కూర్మావతారం ప్రతిమలను చెట్లపై చెక్కారు.ఇవి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పాఠశాల ఆవరణలో తరగతి గదుల సమీపంలో ఉన్న ఒక చెట్టు మొదలు మీద వినాయకుని ప్రతిమను చెక్కారు. అలాగే పాఠశాల చుట్టూ పలువురు దేశ నాయకుల ఫొటోలు, ఇతర చిత్రాలను గీశారు. ఇతని పనితీరు, శ్రద్ధను ప్రిన్సిపాల్ హెచ్. సింహాచలంతోపాటు, మిగతా ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. -
బెజవాడలో స్కూల్ బస్సు బీభత్సం
సాక్షి, అమరావతి బ్యూరో/సత్యనారాయణపురం: విజయవాడలో శ్రీ చైతన్య స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రహదారిపై డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడుపుతూ ఎదురుగా వెళ్తున్న పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అత్యంత రద్దీగా ఉన్న ఈ రహదారిలో ఉదయం ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న ఉదయం 8 గంటలకు మారుతీనగర్ బ్రాంచికి చెందిన శ్రీ చైతన్య హైస్కూల్ బస్సు(ఏపీ16టీజే 6505)లో డ్రైవర్ పి.దుర్గారావు (30) విద్యార్థులను తీసుకొచ్చేందుకు బయల్దేరాడు. మారుతీనగర్ నుంచి రాజీవ్‌నగర్, సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ, సీతన్నపేట చేరుకుని విద్యార్థులను తీసుకొస్తున్నాడు. అక్కడి నుంచి 8.22 గంటల సమయంలో బీఆర్టీఎస్ రహదారిలో ఉన్న శారదా కళాశాల సెంటర్‌కు చేరుతున్న సమయంలో రోడ్డు రద్దీగా ఉన్నప్పటికీ డ్రైవర్ బస్సును నిలిపే ప్రయత్నం చేయకుండా ముందుకు దూసుకెళ్లాడు. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బస్సు తొలుత ట్రాఫిక్ బారికేడ్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, పండ్లు విక్రయించే రిక్షాను, ఆటోలను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆ వాహనాలన్నీ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కృష్ణలంకకు చెందిన పండ్ల వ్యాపారి షేక్ మస్తాన్‌వలీ (66) తీవ్రంగా గాయపడగా స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనదారుడు స్వల్పంగా గాయపడ్డాడు. అలాగే నజీర్ అహ్మద్‌కు చెందిన ఆటో పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో డ్రైవర్ బస్సును రహదారిపైనే విడిచిపెట్టి పరారయ్యాడు. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రేన్ సాయంతో బస్సును స్టేషన్‌కు తరలించారు. హాల్డ్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే.. శ్రీ చైతన్య హైస్కూల్ బస్సును ప్రతిరోజూ తీసుకెళ్లే డ్రైవర్ శుక్రవారం ఉదయం రాకపోవడంతో హాల్టింగ్ డ్రైవర్‌గా దుర్గారావు విధుల్లోకి వచ్చాడు. ఉదయం బస్సును తీసుకెళ్లి తిరిగి స్కూల్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. బస్సు కండీషన్లోనే ఉందని.. బస్సును పరిశీలించిన రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయచంద్రబాబు ‘సాక్షి’కి తెలిపారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కాలేదని.. ఇంజన్ కండిషన్ కూడా బాగా ఉందని ఆయన వివరించారు. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ
సాక్షి, హైదరాబాద్: లంచం తీసుకుంటూ విద్యు త్ శాఖ డీఈ దుర్గారావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. యాదాద్రి భువనగిరి జిల్లా టీఎస్ఎస్పీడీసీఎల్లో దుర్గారావు డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. భాస్కర్‌రావు అనే కాంట్రాక్టర్ దగ్గర బిల్లుల మం జూరుకై రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. దాంతో భాస్కర్‌రావు ఏసీబీని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని దుర్గారావు నివాసంలో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దుర్గారావును అరెస్ట్ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. -
ఎవరెస్ట్ విజేతకు ఊరు జేజేలు
lదుర్గారావుకు స్వగ్రామంలో ఘనస్వాగతం lసన్మానించిన భద్రాచలం ఎమ్మెల్యే రాజయ్య వీఆర్‌పురం (రంపచోడవరం) : ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రెండో పర్వతారోహకుడు కుంజా దుర్గారావు శుక్రవారం సాయంత్రం స్వగ్రామం కుంజవారిగూడెం చేరుకోగా గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. దుర్గారావు గత నెల 13న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. పలువురు దుర్గారావును కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అతడిని ఘనంగా సన్మానించారు. పేద గిరిజన కుటుంబంలో జన్మించిన దుర్గారావు అతి చిన్న వయసులో అత్యంత క్లిష్టమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి వీఆర్‌పురం మండలానికి దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చాడని కొనియాడారు. దుర్గారావుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు వెంటనే చెల్లించాలని, అతడి కుటుంబానికి పక్కా ఇంటిని నిర్మించి ఇవ్వాలని, దుర్గారావు ఉన్నత చదువులకు అవసరం అయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలని కోరారు. ఎంపీపీ కారం శిరమయ్య, సీపీఎం మండల కార్యదర్శి పూనెం సత్యనారాయణ,బొప్పెన కిరణ్ పాల్గొన్నారు. అందరి ఆశీస్సుల ఫలితమే .. తల్లిదండ్రులు, గురుకుల సొసైటీ అధికారుల ఆశీస్సులతో పాటు కోచ్ భద్రయ్య కృషి ఫలితంగానే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలిగానని దుర్గారావు అన్నాడు. గత ఏప్రిల్ 8న ప్రారంభమైన ఎవరెస్ట్ పర్వతారోహణ మే 13న ముగిసిందని తెలిపాడు. ఆరోజు ఉదయం ఆరు గంటలకు ఎవరెస్ట్‌పై జాతీయ జెండా, గురుకుల జెండాలు ఎగురవేయడంతో పాటు ,అంబేడ్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించానని తెలిపాడు. తన విజయానికి కారకులందరికీ రుణపడి ఉంటానన్నాడు. -
బైక్, టిప్పర్ ఢీ: విద్యార్థి మృతి
విజయవాడ(ఇంద్రకీలాద్రి): బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. నగరంలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మైలవరం ఫ్లై ఓవర్‌పై ద్విచక్ర వాహనంపై వెళుతున్న విద్యార్థిని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పీతల దుర్గారావు(18) నగరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధరించారు. -
అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి
కృష్ణా: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ మనుషులను బలితీసుకుంది. ఒక బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. కృష్ణా జిల్లా తోట వల్లూరు వద్ద సోమవారం ఉదయం ద్విచక్రవాహనాన్ని అంబులెన్స్ ఢీకొన్న సంఘటనలో దుర్గారావు అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సతీష్, చంద్రబాబు అనే యువకులు తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.