సాక్షి, హైదరాబాద్: పాతబస్తీకి మెట్రో ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఈ మార్గంలో మెట్రో ఏర్పాటుకు అడ్డు తొలగించాల్సిన ఆస్తుల గుర్తింపు, విద్యుత్ స్తంభాలు, కేబుల్స్, తాగునీరు, మురుగు నీటి పైపులైన్లను గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా చేపట్టాల్సిన ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.5 కి.మీ)మార్గం ఏర్పాటు ప్రక్రియ అనేక అవాంతరాల నేపథ్యంలో నిలిచిపోయిన విషయం విదితమే. తాజా అంచనాల నేపథ్యంలో ఈ మార్గం పూర్తికి సుమారు రూ.1500 కోట్లు వ్యయం కానుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించడంతో ఈ ప్రాజెక్టు పూర్తిపై ఆశలు చిగురిస్తున్నాయి.
అడ్డంకులు వేనవేలు..
- పాతనగరంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికి సుమారు రూ.వంద కోట్లకుపైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
- ఎంజీబీఎస్– ఫలక్‌నుమా రూట్లో 5.5 కి.మీ మార్గంలో మెట్రో ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతోపాటు సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్ ప్రాంతాల్లో ఐదు మెట్రో స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. ఇందుకు రూ.1500 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనావేస్తున్నారు.
- ఇక ఆస్తుల సేకరణ ఆలస్యమైతే పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ఆఫ్ వే స్థల సమస్యల కారణంగా ప్రాజెక్టు నిర్మాణ గడువు ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పనులు ఆలస్యమైతే నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
- ఇక ఈ రూట్లో సుమారు 69 వరకు ఉన్న ప్రార్థనాస్థలాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు సైతం వ్యక్తమౌతున్నాయి. ఈ సమస్యల కారణంగానే గతంలో తొలిదశ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేసిన విషయం విదితమే.
- తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు పెరగడంతో అదనంగా రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగింది.
- ఈ మొత్తాన్ని సైతం తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ప్రభుత్వంతో గతంలో పలు మార్లు సంప్రదింపులు జరిపాయి. కనీసం సాఫ్ట్‌లోన్ అయినా మంజూరు చేయాలని విజ్ఙప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించలేదు.
- మరోవైపు ఈ మెట్రో మార్గాన్ని బహదూర్‌పూరా –కాలాపత్తర్– ఫలక్‌నుమా మీదుగా మళ్లించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ అవాంతరాలను అధిగమించి మెట్రోను పూర్తిచేసి ఓల్డ్‌సిటీ వాసులకు మెట్రో కలను సాకారం చేయాలని సిటీజనులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment