సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో కొత్త అంశాలు బయటికి వస్తున్నాయి. అభ్యర్థులను ఆందోళనకు ఉసిగొల్పినది ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు కాగా.. విధ్వంసానికి రెచ్చగొట్టినది కొందరు అభ్యర్థులేనని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ పేర ఓ వాట్సాప్ గ్రూపు, దానికి అనుబంధంగా మరో 3 గ్రూపులు ఏర్పాటు చేసుకుని.. తీవ్రస్థాయిలో ఆందోళనకు పక్కాగా పథకం రూపొందించుకుని, అమలు చేసినట్టు తేల్చారు.
ఇక విధ్వంసం కేసులో అదుపు లోకి తీసుకున్నవారిలో 45 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ఇక పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రా ల్లోనూ గాలిస్తున్నాయి. నిందితులను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సోమవారం పిటిషన్లు దాఖలు చేయనున్నారు.
బిహార్ ఉదంతాలను చూసి ప్లాన్..: కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించాక మొదట్లో బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విధ్వంసం ఘటనలు జరిగాయి. వాటిని చూసిన కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఆర్మీ అభ్యర్థి శ్రీను ఈనెల 15న మధ్యాహ్నం 1.58 గంటలకు ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న అతను.. ఈ వాట్సాప్ గ్రూపునకు ఎనిమిది మంది అభ్యర్థులను అడ్మిన్లుగా చేశాడు. దీనికి అనుబంధంగా మరికొన్ని గ్రూపులు ఏర్పాటయ్యాయి.
అడ్మిన్లు ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ గ్రూప్‌లోకి దాదాపు 400 మందిని సభ్యులుగా చేర్చారు. తన పేరు బయటికి రాకూడదనే ఉద్దేశంతో శ్రీను ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు. అయితే ఈ గ్రూపులో సభ్యులు బిహార్ మాదిరిగా హల్‌చల్ చేద్దామని చర్చించుకున్నారు. సికింద్రాబాద్ వచ్చిన అందరూ ఒకచోట ఉండొద్దని, వేర్వేరుగా బస చేయాలని సూచించుకున్నారు.
ఆదిలాబాద్ నుంచి వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న సాబేర్ అనే అభ్యర్థి జెండాలు, కర్రలు, రాళ్లు వంటివి తెచ్చే బాధ్యత తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం అవన్నీ తీసుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి అందరికీ అందించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శ్రీను, సాబేర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో పది మంది అనుమానితులను కూడా పట్టుకున్నారు.
నిప్పుపెట్టిన వాళ్లూ చిక్కారు
మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన అభ్యర్థి రాజా సురేంద్ర కుమార్ ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ గ్రూపులో సభ్యులందరినీ రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టాడు. ఆందోళనకు వచ్చే వారంతా పాత టైర్లు, వస్త్రాలు, రాడ్లు, పెట్రోల్ తీసుకుని రావాలని.. వాటిని వినియోగించి విధ్వంసం సృష్టిద్దామని సూచించాడు. శుక్రవారం ఉదయం ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించే ముందు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు అద్దాలను, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైళ్ల ఏసీ బోగీల అద్దాలను పగలగొట్టింది అతడేనని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించారు. ఇక రైలుబోగీల్లోకి ప్రవేశించి నిప్పుపెట్టిన వారిలో ఆదిలాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్, కామారెడ్డికి చెందిన సంతోష్ కీలకంగా వ్యవహరించినట్టు తేల్చారు. ప్రత్యేక బృందాలు ఆదివారం రాత్రి ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నాయి.
బస్సు అద్దాల ధ్వంసంపై మరో కేసు
ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్‌లోకి ప్రవేశించే ముందు రాజేంద్రనగర్, హయత్‌నగర్ డిపోలకు చెందిన మూడు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపాక.. పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
మొత్తంగా రైల్వే స్టేషన్ ఘటనకు సంబంధించి శనివారం 45 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఆదివారం ఉదయం నాగోల్‌లోని రైల్వే కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆయన ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిం దితులను ఆదివారం ఉదయం 8.15 గంటలకు జైలులోకి తీసుకున్నామని చంచల్‌గూడ అధికారులు చెప్పారు.
ఛాతీలోంచి బుల్లెట్ దూసుకెళ్లి.. ఊపిరితిత్తులు ఛిద్రమై..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బీర్‌పేటకు చెందిన రాకేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు.. రాకేశ్ మరణానికి తుపాకీ బుల్లెట్ కారణమని గుర్తించారు. ఛాతీపై కుడివైపు నుంచి శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్ ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేస్తూ ఎడమ వైపు నుంచి బయటికి వెళ్లిందని తేల్చారు.
ఊపిరితిత్తులు బాగా దెబ్బతినడంతో వెంటనే చనిపోయాడని.. పెల్లెట్ (రబ్బరు/ఇతర పదార్థాలతో కూడిన బుల్లెట్) అయితే ఇలా బయటికి దూసుకెళ్లదని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. మిగతా ఐదుగురు క్షతగాత్రుల నుంచి ఏడు బుల్లెట్లను వెలికితీసి, పోలీసులకు అందజేసినట్టు సమాచారం.
నేడు 8 మంది బాధితుల డిశ్చార్జి!
రైల్వేస్టేషన్ ఘటనలో గాయపడిన 14 మందిలో ఒకరు మృతి చెందగా.. మిగతా 13 మందికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఇందులో కోలుకున్న ఎనిమిది మందిని సోమవారం డిశ్చార్జి చేసే అవకాశముందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment