
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ ‘పాలమూరు ఎత్తిపోతల’పై లేదని.. వికారాబాద్ జిల్లా నానాటికి నిర్లక్ష్యానికి గురవుతోందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అనంతగిరిగుట్ట హరిత రిసార్ట్స్‌లో ఆదివారం రాష్ట్ర డెవలప్‌మెంట్ ఫోరం ఆ«ధ్వర్యంలో నదీ జలాల సంరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్ని స్వాధీనం చేసుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. జూరాల ప్రాజెక్టుతో లిఫ్ట్ చేసుకుంటే ఈ ప్రాంతానికి నీళ్లొస్తాయన్నారు.
కాళేశ్వరం నిర్మించిన ఈ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, జూరాల ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతగిరి నుంచి ఏ ఉద్యమం చేపట్టినా ఉవ్వెత్తున ఎగిసిన దాఖలాలున్నాయని ఆయన గుర్తు చేశారు. దీనిపై గ్రామగ్రామాన కరపత్రాలు వేయించి అవగాహన కల్పిద్దామన్నారు. అనంతరం వక్తలందరూ కేంద్ర గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ రణధీర్ బద్దం, అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మాజీ ఓఎస్‌డీ రంగారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment