
సుంకిశాల పంప్ హౌస్ రక్షణ గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సాక్షి, నల్గొండ జిల్లా: సుంకిశాల పంప్ హౌస్ రక్షణ గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. కొన్ని క్షణాలు ముందైనా, ఆలస్యం అయినా భారీగా ప్రాణ నష్టం జరిగేది.
పంప్ హౌస్‌లో షిఫ్ట్‌కు 115 మంది వరకు కూలీలు పని చేస్తున్నారు. సాగర్ డెడ్ స్టోరేజ్‌కు చేరిన సమయంలో హైదరాబాద్‌కు తాగునీటిని అందించడానికి సుంకిశాల పథకం చేపట్టారు. పథకంలో భాగంగా సొరంగ మార్గం నిర్మాణ పనులు చేస్తున్నారు. సొరంగంలోకి సాగర్ నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టగా.. సాగర్ నిండటంతో నీటి ఒత్తిడికి రక్షణ గోడ కూలింది.
దీంతో సొరంగం పూర్తిగా మునిగిపోయింది. నీటిలోనే క్రేన్, టిప్పర్లు, ఇతర సాంకేతిక సామాగ్రి మునిగిపోయాయి. కోట్లలో నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ నెల ఒకటినే రక్షణ గోడ కూలినా అధిక యంత్రాంగం గోప్యంగా ఉంచారు. ఆగష్టు ఒకటిన ఉదయం ఆరుగంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జలమండలి అధికారులు నీళ్లు నములుతున్నారు.
అసలు అక్కడ ఏం జరగలేదన్నట్లు కప్పిపుచ్చుకునే ధోరణిలో అధికార యంత్రాంగం ఉంది. తిరిగి పనులు ప్రారంభం కావాలంటే వచ్చే వేసవి వరకు ఆగాల్సిందే.
