సాక్షి, ఖమ్మం: చింతవర్రె గ్రామంలో లైంగిక వేధింపులకు గురైన బాధిత బాలికల కుటుంబ సభ్యులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బాలల హక్కుల పరిరక్షణ శాఖ చైర్మన్ దివ్య, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పి చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. చింత్రవర్రె ఘటనను తీవ్రంగా ఖండించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ప్రతి బాధిత కుటుంబాలకు ఆశ్వాసన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని, మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటపై చర్చించి బాధితక కుటుంబాలకు న్యాయం చేయాలని, పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక కుటుంబాల తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. బాధిత బాలికల గుర్తింపు బయటకు రాకుండ చూడాలని ఆయన కోరారు.
బాలికలంతా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో శిశువు కేంద్రంలో ఉంటూ మానసికంగా దృఢంగా తయరు అయ్యేటట్లు చుస్తామన్నారు. దీనికి పిల్లల తల్లిదండ్రులు కూడా అంగీకరించారని చెప్పారు. పోక్సో చట్టం కింద బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని, మంత్రిగా.. ఎమ్మెల్యేగా కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కేసు విచారణ అధికారిగా ఎస్పీ ఉంటారని, ఐటీడీయే, పీఓఆర్డీఓ, మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి, అదనపు కలెక్టర్‌లతో విచారణ కమిటీ వేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా చూస్తామని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు పోక్సో చట్టం కింద 1 లక్ష, ప్రభుత్వం తరపు 1 లక్ష రూపాయల చొప్పున మొత్తం 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాసరెడ్డిలు కలిసి రూ. 50 వేలు, ప్రభుత్వం విప్ రేగ కాంతారావు రూ. 50 వేలు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్‌లు కలిసి 5 కుటుంబాలకు చెరో లక్షల రూపాయల చొప్పున బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment