సత్తుపల్లి: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు రైతు పక్షపాతిగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. వీరి తరహాలోనే ఢిల్లీ, కేరళ సీఎంలు కూడా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆయన నటించి, నిర్మించిన రైతన్న సినిమా విడుదల సందర్భంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నారాయణమూర్తి పర్యటించారు.
ఈ మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతుబీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్ వంటి మంచి పథకాలతో రైతులకు మేలు చేస్తున్న సీఎంలను ఎవరూ మరువలేరని తెలిపారు. కాగా, ముప్ఫైఆరేళ్లుగా తాను అనేక సినిమాలు తీశానని తన సినిమాలను చూడాలని ఎప్పుడూ కోరలేదని తెలిపారు.
అయితే, కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు వరాలు కాదు..శాపాలని చెప్పేందుకే రైతన్న సినిమా తీశానని వెల్లడించారు. ఈ సినిమా ప్రజల్లో వెళ్లాలని, రైతుల కష్టాలను అందరూ గుర్తించాలనే భావనతో ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment