టీ–హబ్ బృందంతో రైల్వే ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: వాతావరణ పరిస్థితులు లేదా విద్రోహ చర్యల వల్ల తలెత్తబోయే ప్రమాదాలను రైల్వే సిబ్బంది ముందే పసిగట్టడంలో నెలకొన్న సాంకేతిక సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న రైల్వే.. ఇప్పుడు ఈ విషయంలో స్టార్టప్ కంపెనీల సాయం కోరుతోంది. ఈ మేరకు రూ. 3 కోట్ల వరకు ఆర్థికసాయం, మేధోహక్కుల కల్పన వంటి అంశాలతో కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది.
వీటిపై దక్షిణమధ్య రైల్వే ఇన్‌చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు బృందంతో చర్చించింది. తొలుత 11 రకాల సమస్యలను స్టార్టప్‌ల ముందుంచింది. దీనికి టీ–హబ్ సానుకూలంగా స్పందించింది.
11 సమస్యలు ఇవే..
1. విరిగిన పట్టాను గుర్తించే సాంకేతికత కావాలి. 2. పట్టాలపై ధ్వంసమయ్యేంత ఒత్తిడి ఉంటే ముందుగానే గుర్తించగలగాలి.
3. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంపు సమస్యను అధిగమించే ఏర్పాటు కావాలి.
4.రైల్వే ట్రాక్ తనిఖీలో కచ్చితత్వం ఉండే వ్యవస్థతోపాటు అన్ని లోపాలను సులభంగా గుర్తించే సాంకేతికత కావాలి.
5. అధిక బరువు వల్ల వ్యాగన్ల చక్రాలు దెబ్బతినే పరిస్థితి ఉంటే దాన్ని ముందే గుర్తించే వ్యవస్థ కావాలి.
6. ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్‌కు సంబంధించి 3 ఫేజ్ కరెంటును వాడే వాటిల్లో సమస్యలు ఆన్‌లైన్‌లో గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేయాలి.
7. గూడ్సు రైళ్లలో ఎక్కువ సరుకు పట్టేలా వ్యాగన్‌లను ఎలా మార్చాలి.
8.ట్రాక్‌ను మెరుగ్గా శుభ్రం చేసే సులభ విధానం కావాలి.
9. సిబ్బందికి పునఃశ్చరణ కోర్సులకు సంబంధించి యాప్‌లు రూపొందించాలి.
10.వంతెనల తనిఖీ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ద్వారా జరిగేలా సాంకేతికత రూపొందించాలి.
11. ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం డిజిటల్ వ్యవస్థ కావాలి.
Comments
Please login to add a commentAdd a comment