![Ramgopalpet Fire Accident Deccan Mall Building Collapse Demolition Work - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/31/Deccan.jpg.webp?itok=R1WFH849)
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్‌మాల్ బిల్డింగ్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. కూల్చివేత పనులు కొనసాగుతుండగానే.. ఒక్కసారిగా ఆరు అంతస్తులు కుప్పకూలిపోయాయి. బిల్డింగ్ ముందు భాగం కూల్చివేత పూర్తి కాగా.. వెనక భాగం కూల్చివేత పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే చుట్టుపక్కల ఇళ్ల వారిని ముందుగానే ఖాళీ చేయడంతో ప్రమాదం తప్పింది.
కాగా అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు గత ఆరు రోజులుగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి భారీ యంత్రాల సాయంతో కూల్చివేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 19న డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు మంటల్లో భవనం ఉండటంతో.. అధిక వేడికి పగుళ్లు వచ్చాయి.
ప్రమాద ఘటనలో గల్లంతైన ముగ్గురిలో ఒకరి అస్థిపంజరం లభించగా.. మిగతా ఇద్దరి ఆచూకీ లభించలేదు. వారం రోజులుగా వెతికినా ఇద్దరి అవశేషాలను అధికారులు గుర్తించలేకపోయారు.అయితే భవనాన్ని వెంటనే కూల్చేయాలని నిపుణుల బృందం హెచ్చరించింది. కూల్చేయకపోతే ప్రమాదమని, ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చని తెలిపింది. దీంతో వారిద్దరి ఆచూకీ లభించకపోయినా అధికారులు కేల్చివేత పనులు చేపట్టారు.
స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవనం కూల్చేయాలని అధికారులు ఆదేశించారు. మొత్తం 5 అంతస్తులతో పాటు సెల్లార్ కూడా కూల్చివేయాలని తెలిపారు. భవనం కూల్చివేసి శిథిలాలను వేరే ప్రాంతానికి తరలించడానికి రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
చదవండి: ఈటల ఇలాకాలో కేటీఆర్‌కు నిరసన సెగ.. చేనేత కార్మికుల నిలదీత
Comments
Please login to add a commentAdd a comment