సంగారెడ్డి, సాక్షి: సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక ఉరుకులు పెట్టడంపై సాక్షి ఇచ్చిన కథనం.. ప్రభుత్వం దృష్టికి వెల్లింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తి చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ.. కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం కదిలింది.
నాణ్యతలేని అల్పాహారం, భోజనంతో హాస్టల్ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈలోపు.. తాజాగా హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక చక్కర్లు కొట్టడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి వైరల్ చేశారు. సాక్షిలో ఈ కథనం ప్రముఖంగా ప్రసారమైంది. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఆ వెంటనే మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి రంగంలోకి దిగారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, అందోల్ జోగిపేట డివిజన్ ఆర్డీవో పాండు మంగళవారం మధ్యాహ్నాం క్యాంపస్ హాస్టల్ చేరుకొని జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొంతకాలంగా మెస్‌లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్న విద్యార్థుల ఫిర్యాదుల్ని.. అలాగే ఇవాళ్టి ఎలుక వీడియోను ఆమె పరిశీలించారు. కాంట్రాక్టర్‌ను తొలగించడంతో పాటు కేర్ టేకర్ పైనా లీగల్‌యాక్షన్ తీసుకుంటామని, నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఘటనతో అలర్ట్..
ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో ఉన్న బోర్డింగ్, హాస్టలను , క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలన్నారాయన. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూనే.. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహాకులు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు.. హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్, హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకుల పై నిఘా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment