
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
తెలంగాణ శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉందని, దాన్ని కాపాడుకోవాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శాసన సభలో సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, గత సమావేశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని అధికారులను ఆదేశించారు. సమాచారా న్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అందించాలని.. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందు బాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపాలని సూచించారు. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే.. బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఈసారి కూడా అదే విధంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని అభినందించారు.
చదవండి: కర్ణాటకలో ‘చక్రం’ తిప్పాలని ప్లాన్!
Comments
Please login to add a commentAdd a comment