సాక్షి, హైదరాబాద్: భారీగా పెరిగిన మద్యం ధరలు గ్రేటర్‌లో మద్యం ప్రియులకు శరాఘాతంగా మారాయి. అనూహ్యంగా పెరిగిన ధరల దృష్ట్యా లిక్కర్ వినియోగం కొంత వరకు తగ్గింది. కానీ ఆబ్కారీశాఖ ఆదాయం మాత్రం పెరిగింది. అన్ని రకాల బీర్లు, మద్యం బ్రాండ్‌లపైన ప్రభుత్వం కనిష్టంగా రూ. 20 నుంచి గరిష్టంగా సుమారు రూ.160 వరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో బ్రాండ్ ధర ఒక్కో విధంగా పెరిగింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన మద్యం ప్రియులపైన ధరల భారం పడింది. అనూహ్యంగా పెరిగిన ధరలు నిరాశకు గురిచేశాయి. ధరల పెంపునకు ముందు రోజు అమ్మకాలను నిలిపివేశారు. ఆ తరువాత కొత్త ధరలతో అమ్మకాలు మొదలయ్యాయి.
తగ్గుదల ఇలా...
ధరల పెంపునకు ముందు రంగారెడ్డి జిల్లాలో సుమారు 4 లక్షల కేసుల బీర్లు విక్రయించగా ధరల పెంపు తరువాత ఈ నెల 19 నుంచి 28 వరకు 3.6 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సుమారు 40 వేల కేసుల వరకు బీర్ల అమ్మకాలు పడిపోయాయి. గ్రేటర్‌లో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగే రంగారెడ్డి జిల్లాలో ధరల పెంపునకు ముందు 1.86 లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం విక్రయిస్తే ధరలు పెరిగిన తరువాత 1.84 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి.
సుమా రు 20 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి. అలాగే హైదరాబాద్, మేడ్చెల్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలోనూ ధరల పెంపునకు ముందు, తరువాత లిక్క ర్ అమ్మకాల్లో వ్యత్యాసం స్పష్టంగా నమోదైంది. పెరిగిన ధరల దృష్ట్యా మద్యం వినియోగం కొంత మేరకు తగ్గిందని పలు వైన్‌షాపులకు చెందిన నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. వేసవి ఇంకా నిప్పులు చెరుగుతున్నప్పటికీ బీర్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
బీరుపైన పెరిగిన ధరలు స్వల్పమే అయినా గత వారం కంటే వినియోగం తగ్గింది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఈ నెల మొదటి పది రోజుల్లో 85 వేల కేసుల బీర్లు విక్రయిస్తే ఈ నెల 19 నుంచి 28 వరకు 80 వేల కేసుల బీర్లు అమ్మారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఆదాయం పెరిగింది...
లిక్కర్ ధరలు పెంచడంతో అమ్మకాలు తగ్గినా ఆదాయం మాత్రం కొద్దిగా పెరిగింది. ఈ నెల 8వ తేదీ నుంచి 17 వరకు గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో రూ.315 కోట్ల ఆదాయం నమోదు కాగా, 19వ తేదీ నుంచి 28 వరకు రూ.351 కోట్లకు ఆదాయం పెరిగింది. మూడు జిల్లాల్లోనూ రంగారెడ్డి టాప్‌లో ఉంది. ధరల పెంపునకు ముందు రూ.192 కోట్ల ఆదాయం లభించగా, ప్రస్తుతం రూ.212 కోట్లకు పెరిగింది.
(చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!)
Comments
Please login to add a commentAdd a comment