Telangana Schools Reopen: భయం లేకుంటేనే బడికి పంపండి - Sakshi
Sakshi News home page

Telangana: భయం లేకుంటేనే బడికి పంపండి

Published Wed, Sep 1 2021 1:09 AM | Last Updated on Wed, Sep 1 2021 12:01 PM

Reopening Of Educational Institutions From Today In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పిల్లల్ని స్కూళ్లకు పంపాలా? లేదా? అనేది తల్లిదండ్రుల ఇష్టానికే ప్రభుత్వం వదిలేసింది. ఎలాంటి భయం లేకుంటేనే విద్యార్థుల్ని పాఠశాలలకు పంపాలని స్పష్టం చేసింది. గురుకుల పాఠశాలలు మినహా అన్ని విద్యాసంస్థ లను బుధవారం నుంచి తిరిగి ప్రారం భించాలని ఆదేశించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండూ ఉంటా యని స్పష్టం చేసింది. అయితే గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టళ్ల ప్రారంభాన్నీ నిలిపి వేసింది. విద్యా సంస్థల పునఃప్రారంభంపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో.. విద్యాశాఖ మంగళవారం ఈ మేరకు సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

కోవిడ్‌ నిబం ధనల అమలు, స్కూళ్ళలో శానిటైజేషన్‌ ప్రక్రి యపై గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే దూరదర్శన్, టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వ తాజా మార్గదర్శకాలతో ప్రైవేటు పాఠశాలలు టీచర్ల ద్వారా ఆన్‌లైన్‌లో బోధన కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది

6 లక్షల మంది విద్యార్థులకు ఆన్‌లైనేనా
రాష్ట్రంలో స్కూలు విద్యార్థులు 60 లక్షల మంది వరకూ ఉంటారు. వీరిలో 29 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. 1,200 గురుకుల పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులుండగా, మొత్తం 1,700 సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ 2 లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఈ రెండింటినీ ప్రారంభించడానికి అనుమతించలేదు. దీంతో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు వెళ్లే అవకాశం లేదు. సంక్షేమ హాస్టళ్లలో ఉండేవారు 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వసతి గృహాల్లో ఉంటున్నారు. వీరితో పాటు గురుకుల విద్యార్థులు కొంతకాలం దూరదర్శన్, టీశాట్‌ ద్వారా జరిగే ఆన్‌లైన్‌ తరగతులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్‌ వైపే ‘ప్రైవేటు’ మొగ్గు!
     ఇక ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలతో పాటు విద్యార్థులు చాలావరకు ఆన్‌లైన్‌ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ధర్డ్‌వేవ్‌ భయం ఉండటం వల్ల కొంతకాలం వేచి చూసిన తర్వాతే ప్రత్యక్ష బోధనకు పిల్లలను పంపుతామని తల్లిదండ్రులు అంటున్నారు. కార్పొరేట్‌ స్కూళ్ళ యాజమాన్యాల్లో ఈ తరహా ఆలోచనే ఎక్కువగా కన్పిస్తుండగా.. బడ్జెట్‌ స్కూళ్లు మాత్రం ప్రత్యక్ష బోధనకు ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే తల్లిదండ్రుల్లో ఏ మేరకు సానుకూలత ఉందనేది తెలియడం లేదని ఓ స్కూలు నిర్వాహకుడు తెలిపారు. 

చిన్న తరగతుల నిర్వహణ కష్టమే!
     స్కూళ్ళ ప్రారంభంపై విద్యాశాఖ నెల రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గత అనుభవాలను ఇందులో పొందుపరిచింది. అప్పట్లో తొలుత 9, 10 తరగతుల విద్యార్థులకు, ఆ తర్వాత ఆరు నుంచి 8 తరగతుల విద్యార్థులను అనుమతించిన విషయం గుర్తుచేసింది. దీనివల్ల పెద్దగా సమస్య రాలేదని పేర్కొంది. ఇప్పుడు కూడా తొలుత 9, 10 తరగతులను ప్రారంభించి, క్రమంగా అన్ని తరగతులు మొదలు పెడితే బాగుంటుందని నివేదించింది. అయితే ప్రభుత్వం తమ సూచనను పట్టించుకోలేదని, ఇప్పుడదే గందరగోళానికి దారి తీసిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. చిన్న తరగతుల నిర్వహణ కష్టమేనని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చిన్న తరగతులను ప్రారంభించకూడదని అనధికారికంగా నిర్ణయించినట్టు కూడా తెలిసింది.

హాజరు తప్పనిసరి కాదు: మంత్రి సబిత
    గురుకులాలు మినహా అన్ని విద్యా సంస్థలు బుధవారం నుంచి ప్రారంభిస్తున్నా.. విద్యార్థుల హాజరు తప్పనిసరికాదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. ఈ విషయంలో యాజమాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయవద్దని ప్రైవేటు స్కూళ్ళకు సూచించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహించుకోవచ్చన్నారు. ఇప్పటికే జారీ చేసిన కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో పాఠశాలల నిర్వాహణ సాఫీగా జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  

  • బుధవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విద్యార్థులు ప్రత్యక్షంగా తరగతులకు హాజరయ్యేలా ఎలాంటి ఒత్తిడీ చేయవద్దని ఆదేశించింది.
  • స్కూళ్లకు హాజరయ్యే పిల్లల ఆరోగ్యంతో తమకు సంబంధం లేదనే షరతు విధించొద్దని, ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు యాజమాన్యాలు ఎలాంటి అంగీకారపత్రాలూ తీసుకోవద్దని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement