మోగనున్న బడిగంట: ప్రత్యక్ష బోధనకు సర్వం సిద్ధం! | Telangana Schools to reopen from Sep1 Everything being ready | Sakshi
Sakshi News home page

మోగనున్న బడిగంట: ప్రత్యక్ష బోధనకు సర్వం సిద్ధం!

Published Mon, Aug 30 2021 9:20 AM | Last Updated on Mon, Aug 30 2021 9:24 AM

Telangana Schools to reopen from Sep1 Everything being ready - Sakshi

ఫైల్‌ ఫోటో

శేరిలింగంపల్లి: కరోనా వ్యాప్తితో మూతపడ్డ పాఠశాలలను సెప్టెంబర్‌ 1 నుంచి తెరిచి తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధన నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎంఈఓ ఆధ్వర్యంలో   శానిటేషన్, ఎంటమాలజీ విభాగం సిబ్బంది పారిశుద్ధ్య, శానిటైజేషన్‌ పనులను నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ రెండు రోజులుగా పరిశుభ్రతా పనులు నిర్వహిస్తున్నారు. ప్ర­భుత్వం ఇక ఆన్‌లైన్‌ తరగతులకు స్వస్తి పలకాలని నిర్ణయించడంతో విద్యార్థులంతా పాఠశాలలకు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 

జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యవేక్షణలో..
 ప్రభుత్వ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణను శుభ్రం చేయించే బాధ్యత జీహెచ్‌ఎంసీ అధికారులు తీసుకున్నారు.
  తరగతి గదులను శుభ్రం చేయడంతో పాటు శానిటైజ్‌ చేస్తున్నారు. 
 వెస్ట్‌జోన్‌ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్, జంట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు వెంకన్న, సుధాంషుల పర్యవేక్షణలో ఇంజినీరింగ్, శానిటేషన్‌ అ­ధికారులు ఈ పనులను సమన్వయం చేస్తున్నారు. 

శేరిలింగంపల్లిలోని ప్రభుత్వపాఠశాలల వివరాలు:
శేరిలింగంపల్లి ప్రాంతంలో మొత్తం 60 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో 14,332 మంది   విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. 
మొత్తం 13 జెడ్‌పీహెచ్‌ఎస్‌లలో 6,232 మంది విద్యార్థులు, నాలుగు యూపీఎస్‌ స్కూళ్లలో 908 మంది విద్యార్థులు, 43 ప్రాథమిక పాఠశాలల్లో 7,192 మంది విద్యార్థులు చదువుతున్నారు. 
 శేరిలింగంపల్లి మండలంలో ప్రైవేటు పాఠశాలలు 261 ఉండగా, వాటిల్లో 90 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు.


సురభికాలనీ పాఠశాలలో పరిశుభ్రత పనులు, పాపిరెడ్డికాలనీలోని గ్రౌండ్‌ను చదును చేస్తున్న దృశ్యం  

పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి
కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా చిన్నారులు పాఠశాలలకు వెళ్లేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని మానసికంగా సిద్ధం చేయాలి. పాఠశాలలన్నింటినీ జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయంతో పరిశుభ్రం చేసి శానిటైజ్, చేయిస్తున్నాం. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం కోవిడ్‌ నిబంధనలను విధిగా అందరూ పాటించాల్సిందే. సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి స్కూళ్లు తెరిచేలా శానిటైజ్‌ చేయించి సిద్ధం చేస్తున్నాం. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తాం.  -కె.వెంకటయ్య, మండల విద్యాధికారి శేరిలింగంపల్లి

ఉపాధ్యాయులు పాటించాల్సిన అంశాలివీ...
♦ జీహెచ్‌ఎంసీతో సమన్వయం చేసుకొని పాఠ శాల ఆవరణ అంతా పరిశుభ్రంగా మార్చాలి. 
♦ పాఠశాలలోని తరగతి గదులు శుభ్రం చేయించాలి. 
♦ పాఠశాలను పూర్తిగా శానిటైజ్‌ చేయించాలి. 
♦ పాఠశాల ఆవరణలో ఓవర్‌ హెడ్‌   ట్యాంక్‌లు, సంపులను క్లీనింగ్‌ చేయించాలి. 
♦ విద్యార్థులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలి. 
♦ ప్రభుత్వం ఆదేశించిన కోవిడ్‌ నిబంధనలన్నీ విధిగా అందరూ పాటించాలి. 
♦ పరిశుభ్రమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం తయారీ, భౌతిక దూరం పాటిస్తూ వారు భుజించేలా చూడాలి.

విద్యార్థులు పాటించాల్సిన అంశాలు:
♦ ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలి. 
♦ పాఠశాలలో భౌతిక దూరం పాటించాలి. 
♦ చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి. 
♦ కోవిడ్‌ నిబంధనలన్నీ తప్పక పాటించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement