సాక్షి, హైదరాబాద్: చట్టంలో లోపాలుంటే వాటిని సరిచేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని లేదా పార్లమెంటును సంప్రదించాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాలలో ఉన్న లోపాలను సరిదిద్దాలని ఆదేశించే పరిధి తమకు లేదని పేర్కొంది. చట్టాలను రూపొందిం చడమనేది పార్లమెంట్ విధానపరమైన నిర్ణయమని, ఆ చట్టాలను మార్చాలంటూ ఆదేశించజాలమని, ఇటు వంటి అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోజా లవని తేల్చిచెప్పింది. 2018లో భారతీయ శిక్షా స్మృతి లోని (ఐపీసీ) సెక్షన్ 376, 376–ఎ(అత్యాచారం)లో జరిగిన సవరణలో లోపముందని, 16 ఏళ్లలోపు అమ్మాయిపై లైంగిక దాడి జరిగిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయినా దోషికి మరణశిక్ష విధించే అవకాశం లేదంటూ నగరానికి చెందిన న్యాయవాది బి.నవప్రవళిక దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఐపీసీ సెక్షన్ 376, 376–ఎ లోపముందని, 16 ఏళ్లలోపు అమ్మాయిపై లైంగిక దాడి జరిగి, తర్వాత ఆ అమ్మాయి చనిపోయినా దోషులకు మరణశిక్ష విధించే అవకాశం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది డొమినిక్ ఫెర్నాండెజ్ నివేదించారు. ఈ లోపాన్ని సరిదిద్దేలా ఆదేశించాలని, లేకపోతే అనేకమంది దోషులు మరణశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. లైంగిక దాడికి గురైన 16 ఏళ్లలోపు అమ్మాయి చనిపోతే సెక్షన్ 376 (అత్యాచారం)తోపాటు సెక్షన్ 302 (హత్య) కింద విచారిస్తారని, సెక్షన్ 302 కింద మరణశిక్ష విధించవచ్చని ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
జోక్యం చేసుకోలేం: ‘‘వాస్తవ పరిస్థితుల ఆధారంగా, ఏదైనా కేసును ఉదహరిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసి ఉంటే బాగుండేది. ఇది న్యాయవర్సిటీల్లో అకడమిక్ అంశంగా చర్చించాల్సినది. నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్‌గా నేను ఈ అంశంపై చర్చ జరగాలని భావిస్తున్నా. అంతేగానీ న్యాయస్థానాలు ఇటువంటి పిటిషన్లకు వేదికగా మారితే ప్రతి చట్టంలో లోపం ఉందంటూ వేల పిటిషన్లు వరదలా వచ్చి పడతాయి. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని చట్టాలను రూపొందిస్తాయి. ఆ చట్టంలో లోపం ఉంటే కేంద్ర న్యాయశాఖ మంత్రిని గానీ, పార్లమెంట్‌ను కానీ సంప్రదించి లోపాన్ని సరిచేయాలని కోరాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. పిటిషనర్ ఈ లోపాన్ని సరిదిద్దాలంటూ కేంద్ర న్యాయశాఖకు వినతిపత్రం కూడా ఇవ్వలేదు. వినతి పత్రం ఇచ్చి ఉన్నా దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకో వాలని కేంద్రాన్ని ఆదేశించే వాళ్లం’’అని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ అన్నారు. అయితే, చట్టంలో లోపాన్ని సరిదిద్దాలంటూ కేంద్ర న్యాయశాఖకు వినతిపత్రం సమ ర్పించామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
పీపీల కొరత ఉంటే విచారణ ఎలా?
‘‘క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇందుకు కారణం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీ) కొరత తీవ్రంగా ఉండటమే. పీపీలు లేకుండా క్రిమినల్ కేసుల ట్రయల్ ఎలా ముందుకు సాగుతుంది. ప్రభుత్వం వెంటనే అన్ని కోర్టుల్లో పీపీలను నియమించాలి. వరంగల్‌లో మూడు నెలల చిన్నారిపై లైంగిక దాడికి సంబంధించిన ఘటనలో రోజువారీ పద్ధతిలో విచారణ జరిగింది. ఇలాంటి అరుదైన కేసుల్లో తప్ప రోజువారీ పద్ధతుల్లో విచారణ చేపట్టాలని ఆదేశించలేం. క్రిమినల్ కేసుల సత్వర విచారణ జరిగి దోషులకు శిక్షలు పడాలంటే అన్ని కోర్టుల్లో పీపీలు ఉండాలి’’అని ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment