సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమా.. వద్దా.. అనే విషయం స్పష్టం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘భూమిని సిద్ధం చేయడం (ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్)’అన్న పదానికి స్పష్టమైన అర్థం చెప్పాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న నిర్మాణాలకు అనుమతి అవసరమా.. కాదా.. భవిష్యత్తులో చేపట్టబోయే నిర్మాణాలు భూమిని సిద్ధం చేయడం అన్న అర్థానికి లోబడి ఉంటాయా లేదా అన్నది కూడా తెలపాలని సూచించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ లేదా ఇతర హైకోర్టులు భూమిని సిద్ధం చేయడం అన్న పదానికి ఏమైనా నిర్వచనం చెప్పాయా అన్నది కూడా పరిశీలించి చెప్పాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేతను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వరకు ధర్మాసనం పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సచివాలయం కూల్చివేతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందలేదని, ఈ నేపథ్యంలో కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కూల్చివేతలకు అనుమతులు తీసుకోవాల్సిందేనని పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పలు సుప్రీంకోర్టు తీర్పులను, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనలను సమర్పించారు.
నూతన భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి తీసుకోవాల్సి ఉందని, కూల్చివేయడానికి అనుమతి అవసరం లేదని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అసెస్‌మెంట్ అథారిటీ ఇచ్చిన నివేదికలను, పలు సుప్రీంకోర్టు తీర్పులను ధర్మాసనానికి సమర్పించారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం... గతంలో తాము లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఈ నివేదికలో స్పష్టమైన వివరణ లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ధర్మాసనం లేవనెత్తిన అన్ని అంశాలపై కేంద్ర పర్యావరణ విభాగం అధికారులు అధ్యయనం చేస్తున్నారని, శుక్రవారంలోగా స్పష్టమైన వివరణ ఇస్తామని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు ధర్మాసనానికి నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఎన్జీటీ నోటీసులు...
సచివాలయం భవనాల కూల్చివేత వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సచివాలయం భవనాల కూల్చివేతను సవాల్ చేస్తూ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హరిత ట్రిబ్యునల్ చెన్నై విభాగం జ్యుడీషియల్æ మెంబర్ జస్టిస్ కె.రామక్రిష్ణన్, ఎక్స్‌పర్ట్ మెంబర్ సైబల్ దాస్‌గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారించి ప్రతివాదులుగా ఉన్న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రభావ అసెస్‌మెంట్ కమిటీలకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment