కాంగ్రెస్, బీజేపీ యువ మంత్ర: రేవంత్‌, కిషన్‌ రెడ్డి రెడీ | Revanth Reddy And Kishan Reddy Hot Topic In Telagnana Polictis | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీ యువ మంత్ర: రేవంత్‌, కిషన్‌ రెడ్డి రెడీ

Published Thu, Jul 8 2021 4:15 AM | Last Updated on Thu, Jul 8 2021 8:19 AM

Revanth Reddy And Kishan Reddy Hot Topic In Telagnana Polictis  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇప్పుడు హాట్‌ స్పాట్‌గా మారింది. గరంగరం రాజకీయాలకు వేదికగా మారబోతోంది. రాష్ట్రంపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు యువనాయకత్వానికి పట్టంకట్టాయి. కాకతాళీ యమే అయినా బుధవారం కేంద్ర కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణం చేయగా, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా అనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరూ యువనేతలే. ఈ రెండు పార్టీలు వీరిద్దరినీ ముందు పెట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఢీకొనేలా పావులు కదుపుతోంది. వీరిద్దరు 2018 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినా 2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ సభ్యులుగా ఎన్నిక కావడం వారికి కలిసోచ్చిన అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వీరిద్దరు తొలిసారి లోక్‌సభకు ఎన్నిక కావడం ఒకటైతే, వీరు కీలక బాధ్యతలను ఒకేరోజు చేపట్టడం గమనార్హం. ఈ ఇద్దరు నేతలు టీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా రానున్న రోజుల్లో మరింత తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవ కాశాలున్నాయి.

సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా, శాసనసభాపక్ష నేతగా, రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎదిగి, ప్రస్తుతం కేంద్రమంత్రివర్గంలో హోం శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న కిషన్‌రెడ్డికి కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అంటే రాష్ట్రంలో పార్టీ దూకుడుగా వెళ్లాలని సంకేతాలు ఇచ్చినట్లు స్పష్టమవు తోంది. అమిత్‌ షా గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనే బెంగాల్‌ ఎన్నికల తరువాత తమ ఫోకస్‌ తెలంగాణపైనే ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడమే కాక, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై దూకుడు పెంచడానికే కిషన్‌రెడ్డికి పదోన్నతి కల్పిం చినట్లు స్పష్టమవుతోంది. కిషన్‌రెడ్డి రాష్ట్రంలో పర్యటించినప్పుడల్లా అధికారపార్టీపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సక్రమంగా పనిచేయలేదని, ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్‌ నుంచి నిధులు సమకూర్చినా ప్రభుత్వం వాటిని సకాలంలో పూర్తి చేయలేకపోయిందని దుయ్యబట్టారు. ఇకపై కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా దూకుడుగా వెళ్లనున్నారు. 

పగ్గాలు చేపట్టిందే తడవుగా...టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాను బాధ్యతలు స్వీకరించిన రోజునే అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ తల్లిని ఫామ్‌హౌస్‌లో బందీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. తెలంగాణకు పట్టిన పీడ, చీడ కేసీఆర్, ఆయన కుటుంబం అని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని, పార్టీ అధినేతను గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాలుగేళ్ల వ్యవధిలోనే ఆ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు కావడం ఆషామాషీ కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించిన విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ ఈ సందర్భంగా నొక్కి చెప్పారంటే.. పార్టీ రేవంత్‌రెడ్డిపై ఎలాంటి బాధ్యతను పెట్టిందో స్పష్టమవుతోంది. పార్టీలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్నవారిని కాదని రేవంత్‌ను అధ్యక్ష పదవి వరించడంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిపై రానున్న రోజుల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడనున్నారు. మరోవైపు రాష్ట్రంలో గురువారం మరో కొత్త పార్టీ షర్మిల నాయకత్వంలో ఆవిర్భవిస్తోంది. ఆమె ముందు నుంచి అధికారపార్టీ లక్ష్యంగా అస్త్రాలు సంధిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయవేడి తీవ్రస్థాయికి చేరుకోనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement