మేమొచ్చాక 2 లక్షల ఉద్యోగాలు | Revanth Reddy Assures Two Lakh Govt Jobs If Congress Voted To Power | Sakshi
Sakshi News home page

మేమొచ్చాక 2 లక్షల ఉద్యోగాలు

Published Mon, Mar 14 2022 2:07 AM | Last Updated on Mon, Mar 14 2022 2:59 PM

Revanth Reddy Assures Two Lakh Govt Jobs If Congress Voted To Power - Sakshi

ఆదివారం కొల్లాపూర్‌ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో మల్లు రవి. 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ‘డిసెంబర్‌లో కేసీఆర్‌ ప్రభుత్వం రద్దు అవుతుంది. వచ్చే మార్చికల్లా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 12 నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం..’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. అంతవరకు ఓపిక పట్టాలి అని, తెలంగాణలో కాంగ్రెస్‌ ఉంటేనే పేదలకు అండ దొరుకుతుందని పేర్కొన్నారు.

మంత్రివర్గంలో నలుగురు మహిళలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్రమంతటా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతానన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన ఊరు – మన పోరు’కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌ మాట్లాడారు.

50 ఏళ్లయినా ‘పాలమూరు’ పూర్తవుతుందా? 
‘కరువు ప్రాంతమైన పాలమూరులో వలసలు ఆపేందుకు ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఎనిమిదేళ్లయినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన 50 ఏళ్లయినా ప్రాజెక్టును పూర్తిచేసేలా కనిపించడం లేదు. నీళ్లిస్తే పంటలెందుకు ఎండుతున్నాయో నీళ్ల నిరంజన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. ..’అని డిమాండ్‌ చేశారు.  

వైఎస్‌ను నకల్‌ కొట్టాలని చూస్తున్నారు 
‘చేపల వేటను వృత్తిగా బతికే ముదిరాజుల్లో ఎదిగిన ఒక్కడినీ ఓర్వలేక బొందపెట్టాలని చూస్తే.. జనం కర్రు కాల్చి వాత పెట్టారు. టీఆర్‌ఎస్‌ నాయకుల నెత్తి మీద రూపాయి పెడితే ఏక్‌ అణాకు కూడా అమ్ముడుపోరు. లాల్చీ వేసుకుంటే లాల్‌ బహదూర్‌ శాస్త్రి కాలేరు, గడ్డం పెంచుకుంటే భగత్‌ సింగ్‌ కాలేరు. పంచె కట్టుకుంటే వైఎస్‌ రాజశేఖర రెడ్డి కాలేరు. ఈ మధ్య నకిలీ పంచెగాళ్లు వైఎస్‌ను నకల్‌ కొట్టాలని చూస్తున్నారు. ఓట్ల కోసం ‘పీకే’డ్రామాలు ఆడుతున్నారు..’అని విమర్శించారు.  

కేసీఆర్‌ ఆరోగ్యంతో ఉండాలి.. కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోవాలి 
‘కేసీఆర్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే ఫొటోలు బయటకు విడిచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోవాలి. నల్లమల అడవి గాలి పీల్చి, కృష్ణా నీటిని తాగిన పాలమూరు బిడ్డకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశాన్ని సోనియా ఇచ్చారు. ఒక్క ఓటుతో మీ బిడ్డను ఆశీర్వదించండి..’అని రేవంత్‌ కోరారు. 

శ్రీనివాస్‌గౌడ్‌ను కుక్క కూడా కరవదు 
‘కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇప్పించేందుకు నేను శాయశక్తులా కృషి చేశా. కానీ కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం, కోట్ల కోసం పార్టీ మారిండు. ఏ ముఖం పెట్టుకుని కొల్లాపూర్‌లో తిరుగుతుండు ఆ సన్నాసి. నాగర్‌కర్నూల్‌లో మర్రో.. తిర్రోడో ఎమ్మెల్యే ఉన్నడు. బంకమట్టిని కూడా వదలడం లేదు. అచ్చంపేటలో గువ్వలోడు గబ్బిలాలోడు కూడా అంతే.

అబ్రహాం గురించి నేను చెప్పను. ముందస్తు అంటూ ఆయనే ప్రకటనలు చేస్తున్నడు. అలంపూర్‌లో సంపత్‌కుమార్‌ 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రోడ్డు మీద పోయే కుక్క కూడా కరవదు. ఆయన హత్యకు రూ.15 కోట్ల సుపారీ ఇచ్చారంటా. ఇసుక, మట్టి, భూముల ఆక్రమణలు, గుడి భూముల ఆక్రమణలు చేసి ఎంత మందిని బాధపెట్టారో ఆయన.

ఇక జిల్లా ఎంపీల పరిస్థితి చూస్తే.. ‘మంచోడని మంచం ఎక్కిస్తే.. మంచం అంతా పాడుచేసిండంటా..’అట్లుంది..’అంటూ రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సమావేశంలో పార్టీ నేతలు బోస్‌రాజు, అంజన్‌కుమార్‌ యాదవ్, సంపత్‌కుమార్, మల్లు రవి, షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, జిల్లా అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement