సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తర్వాత.. కాంగ్రెస్ శ్రేణుల్లోని ఆయన అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ కొత్త సీఎం ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అదే సమయంలో రేవంత్ స్వస్థలంలో పండుగ వాతావరణం నెలకొంది.
రేవంత్‌రెడ్డి పుట్టింది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో. ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించాక ఆ ఊరి ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. పటేలా.. అంటూ రేవంత్‌ను ఆప్యాయంగా పిలిచే కొందరు మీడియాతో తమ సంతోషం పంచుకున్నారు.
‘‘మా రేవంత్ పటేల్ సీఎం అయ్యాడు. ఢిల్లీకి రాజు అయినా.. తల్లికి కొడుకే. రేవంత్ అప్పటికీ.. ఇప్పటికీ మా మంచి పటేల్. ఎప్పుడు ఊరికి వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇకపై మా ఊరు కొండారెడ్డిపల్లి కాదు.. సీఎం ఊరు’’ అని గ్రామస్తులు స్వీట్లు పంచుకుంటూ, రంగులు చల్లుకుంటూ కనిపించారు.
పాలమూరు నుంచి రెండో సీఎం!
గతంలో హైదరాబాద్ స్టేట్‌కు కల్వకుర్తి నుంచి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పని చేశారు. దశాబ్దాల తర్వాత ఇప్పుడు పాలమూరు ప్రాంతంలో పుట్టిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment