వా(వ)రి గోస ఎవరికెరుక! మిల్లర్లు కొనరాయే.. అరిగోస పడి అగ్గువకు అమ్ముడాయే! | Rice Millers In Telangana Reduced The Price Of Paddy | Sakshi
Sakshi News home page

వా(వ)రి గోస ఎవరికెరుక! మిల్లర్లు కొనరాయే.. అరిగోస పడి అగ్గువకు అమ్ముడాయే!

Published Sun, Apr 3 2022 2:30 AM | Last Updated on Sun, Apr 3 2022 3:23 PM

Rice Millers In Telangana Reduced The Price Of Paddy - Sakshi

త్రిపురారంలో ఓ రైస్‌ మిల్లు వద్ద వరుసలో ఉన్న ధాన్యం ట్రాక్టర్లు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండాపోతోంది. మిల్లర్లు తమ ఇష్టానుసారంగా ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆందోళనలో పడ్డారు. నాలుగు రోజుల కిందటి వరకు బాగానే ధర చెల్లించిన మిల్లర్లు ఒక్కసారిగా తగ్గించేశారు. శుక్ర, శనివారాల్లో ప్రాంతాన్ని బట్టి ఒక్కో క్వింటాల్‌పై రూ.300 నుంచి రూ.450 వరకు తగ్గించి కొనుగోలు చేశారు.

నాలుగు రోజుల కిందటి వరకు సన్నరకం (చింట్లు) ధాన్యం క్వింటాల్‌కు రూ.2,200 చెల్లించగా, మిర్యాలగూడ ప్రాంతంలోని కొన్ని మిల్లుల్లో సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,900 నుంచి రూ.1,850 చెల్లించారు. ఇక త్రిపురారంలోని ఓ మిల్లులో శనివారం క్వింటాల్‌కు కేవలం రూ.1,750 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

రెండు, మూడు రోజులు పడిగాపులు..
నల్లగొండ జిల్లాలో ముందస్తు నాట్లు వేసిన ప్రాంతాల్లో సన్నాల కోతలు 15 రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. దీంతో పది రోజులుగా రైతులు మిల్లులకు వచ్చి ధాన్యం అమ్ముతున్నారు. మొదట్లో ధాన్యం తక్కువగా రావడంతో ఎక్కువ ధర చెల్లించిన మిల్లర్లు, ఇప్పుడు ధాన్యం రాక ఎక్కువ కావడంతో ధరను తగ్గించేశారు. అంతేకాక రైతులు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో రెండు, మూడు రోజల పాటు కొనుగోలు చేయకుండా పెండింగ్‌ పెడుతున్నారు.

రైతులు విసిగిపోయి తక్కువ ధరకైనా అమ్ముకొని వెళ్తారనే ఉద్దేశంతోవారు వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు తక్కువ ధరకు అమ్ముకోక తప్పడం లేదు. కొనుగోళ్లలో జాప్యం వల్ల త్రిపురారం మండలంలోని ఒక్కో మిల్లు వద్ద 20 నుంచి 30 ట్రాక్టర్లలో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.

25 శాతం ఉమ్మడి జిల్లా నుంచే..
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ధాన్యం దిగుబడిలో 25 శాతం వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే వస్తోంది. అత్యధింగా 250 రైస్‌ మిల్లులు ఉన్నది ఇక్కడే. నల్లగొండ జిల్లాలో 130, సూర్యాపేట జిల్లాలో 83, యాదాద్రి జిల్లాలో 37 మిల్లులు ఉన్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌లోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సన్నాలు, దొడ్డు ధాన్యం కలిపి దాదాపు 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

నల్లగొండ జిల్లాలో ఈ సీజన్‌లో సన్నాలు 2,34,752 ఎకరాల్లో సాగు చేయగా, 4,59,446 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దొడ్డు ధాన్యం 2,09,226 ఎకరాల్లో సాగు చేయగా అందులో 6,54,157 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, మొత్తం 4,43,973 ఎకరాల్లో వరి సాగు చేయగా, సన్న, దొడ్డు ధాన్యం కలిపి 11,13,604 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.

సూర్యాపేట జిల్లాలో 4,61,532 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. అందులో 3,45,081 ఎకరాలలో సన్న రకాలు, 1,16,449 ఎకరాలలో దొడ్డు రకాలను సాగు చేశారు. తద్వారా 8,28,196 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం, 3,26,058 మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం వస్తుందని లెక్కలు వేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్లు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సన్నరకం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు..

ధర స్థిరంగా ఉండేలా చూడాలి 
నాకున్న 8 ఎకరాల్లో హెచ్‌ఎంటీ రకం సాగుచేశా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు మిల్లుకు వెళుతున్నారు. మొదట్లో ధర బాగానే పెట్టినా ఇప్పుడు క్వింటాల్‌కు రూ.1,870 మాత్రమే చెల్లిస్తున్నారు. ధర స్థిరంగా ఉండేలా చూడాలి.
– చల్లా ప్రదీప్‌కుమార్, అన్నపరెడ్డిగూడెం 

ధర తగ్గించారు 
మొన్నటి వరకు మిల్లర్లు రూ.2,200 పెట్టినా ఇప్పుడు ధర తగ్గించారు. నాకున్న 2.1 ఎకరాల్లో చింట్లు సాగు చేయగా 65 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. క్వింటాలుకు రూ.1,850 ఇస్తామంటున్నారు. 
– ధీరావత్‌ తుకారాం, ఏడుకోట్ల తండా 

రూ.1,750 ఇస్తున్నారు
ఈసారి పంట దిగుబడి తగ్గింది. దీనికి తోడు ధర తగ్గించారు. మొదట రూ. 2,200 ఉందని సంతోష పడ్డాం. ఇప్పుడు మిల్లుకు వచ్చేసరికి క్వింటాలుకు రూ.1,750 ఇస్తున్నా రు. గత్యంతరం లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. 
– యేమిరెడ్డి వెంకట్‌రెడ్డి, త్రిపురారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement