భద్రాచలం/కాళేశ్వరం/వాజేడు: తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 38.70 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయానికి 50 అడుగులకు చేరువైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
చదవండి: మీ వాహనం సేఫ్‌గా ఉండాలా.. వానాకాలంలో ఈ టిప్స్ పాటించాల్సిందే
ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరదలతో గోదావరి 55 అడుగులు దాటే అవకాశమున్నందని, ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు. జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని, ప్రజలు వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి–బైరాగులపాడు ప్రధాన రహదారిపైకి వరద భారీగా చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలలోని సీతమ్మ నారచీరల ప్రాంతం ముంపునకు గురైంది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో మంగళవారం 9 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment