సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్: కరోనా నుంచి కోలుకున్న చాలామందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలట్లేదు. బ్లాక్‌ఫంగల్ ఇన్‌ఫెక్షన్ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా బ్లాక్‌ఫంగస్ లక్షణాలు కన్పిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటివరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే వెలుగుచూసిన ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కేసులు రాష్ట్రం లోనూ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి.
సోమవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు, నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరు బ్లాక్‌ఫంగస్‌తో మృతిచెందారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో 16 మంది చికిత్స పొందుతుండగా, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పదిమంది చనిపోయారు. బ్లాక్‌ఫంగస్ కేసుల చికిత్సకు వీలుగా ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్ సెంటర్‌గా ప్రకటించారు.
ఈ కేసులకు సంబంధించి కచ్చితమైన నిర్ధారణ కోసం కొందరి నమూనాలను బయాప్సీకి పంపారు. అలాగే, బ్లాక్‌ఫంగస్ బాధితుల కోసం గాంధీ ఆస్పత్రి 7వ అంతస్తులో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. బాధితులకు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు గాంధీ ఈఎన్‌టీ విభాగం ముందుకు రావడంతో ఇక్కడే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను రెండ్రోజుల్లో అందుబాటులోకి తేవాలని ఆస్పత్రి పాలన యంత్రాంగం నిర్ణయించింది.
ఎందుకు సోకుతుందంటే..
కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో కోలుకున్న అనంతరం బాధితులు బ్లాక్‌ఫంగస్ బారిన పడుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. మధుమేహం, కిడ్నీ, కాలేయం ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ మోతాదుకు మించి ఇస్తుండటంతో.. కోవిడ్‌తో విముక్తి లభించిన తర్వాత బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతోంది. సాధారణ వాతావరణంలో కూడా ఉండే బ్లాక్‌ఫంగల్.. రోగనిరోధక శక్తి లేనివారికి త్వరగా సోకుతోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, చీదినప్పుడు నల్లటి పదార్థం బయటికి రావడం, ముక్కు లోపల వాపు, నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక్కరోజే నలుగురు మృతి..
- నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఎల్‌కే ఫారమ్ గ్రామానికి చెందిన బెజవాడ హరిబాబు (35) కరోనాతో జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ముక్కు, చెవుల నుంచి రక్తం రాగా బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా భావించి శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందారు.
- వేల్పూర్ మండలం సాహెబ్‌పేట్‌కు చెందిన ఉట్నూర్ చిన్న గంగారాం (65) రెండు వారాల క్రితం కరోనా బారిన పడ్డారు. కోలుకున్న కొద్దిరోజులకే మళ్లీ తిరగబెట్టడంతో నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించి మూడ్రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మరణించారు.
- బోధన్ పట్టణం శక్కర్‌నగర్ కాలనీకి చెందిన మర్రి రాజేశ్వర్ (39) పదిరోజుల క్రితం కరోనా బారినపడి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. నాల్రోజుల కిత్రం బాధితుడిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం రాత్రి మృతిచెందారు.
- నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెంకు చెందిన ల్యాధా గండయ్య (57) కరోనా బారినపడ్డారు. మూడ్రోజుల క్రితం గండయ్యకు ఒళ్లు నొప్పులు, జ్వరంతోపాటు కంటిచూపు మందగించింది. ఆదివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకురాగా..వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించి వైద్యం చేశారు. చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు.
పెరుగుతున్న కేసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజాపురం గ్రామానికి చెందిన తూనుకుంట్ల సులోచనరాణి ఈనెల 10న కరోనా బారినపడ్డారు. సోమవారం ఆమెకు కన్ను, ముఖం వాచిపోవడంతో పెనుబల్లిలోని ఆస్పత్రికి రాగా, వైద్యులు బ్లాక్‌ఫంగస్‌గా నిర్ధారించి ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కె.సత్యనారాయణరెడ్డి (35)కి వారం క్రితం కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అకస్మాత్తుగా కంటిచూపు మందగించి, కళ్లు వాచిపోవడంతో కుటుంబసభ్యులు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం లింగయ్య (44) కరోనా బారినపడి ఇటీవలే కోలుకున్నారు.
ఆదివారం దవడ, ముక్కులోంచి చీము కారడంతో ఆయనను హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లారు. సోమవారం పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి (40) కరోనా నుంచి కోలుకున్న మూడ్రోజులకే అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారినపడగా, ఆయనకు వైద్యులు సోమవారం ఒక కన్ను తొలగించారు.
స్టెరాయిడ్స్ మోతాదు మించడం వల్లే..
రోగ నిరోధకశక్తి తక్కువున్నవారిపై ఫంగస్ ప్రభావం చూపుతోంది. ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముక్కు, కన్ను, మెదడు, పై దవడ, సైనస్‌లు దెబ్బతింటాయి. ఎంత వేగంగా విస్తరిస్తుందో.. అంతే వేగంగా కణాలను, ఎముకలను దెబ్బతీస్తుంది. కోవిడ్ చికిత్సల్లో మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇచ్చిన మధుమేహ బాధితుల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది.
– డాక్టర్ మేఘనాథ్, ఈఎన్‌టీ నిపుణుడు, ’మా’ ఆస్పత్రి
కోలుకున్నాక కూడా మాస్క్ వాడాలి
కరోనా బాధితులకు స్టెరాయిడ్స్ ఏ దశలో ఎంత మోతాదులో వాడాలనేది చాలామందికి అవగాహన లేదు. స్టెరాయిడ్స్ కరోనా లక్షణాల నుంచి ఉపశమనం కల్పిస్తున్నా.. రోగ నిరోధకశక్తిని తగ్గిస్తాయి. కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా మాస్క్ ధరిస్తే ఫంగస్ బారినపడకుండా ఉండొచ్చు.
– డాక్టర్ రవిశంకర్, ఈఎన్‌టీ నిపుణుడు, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి
అందరికీ రాదు..
కరోనా బాధితుల్లో ప్రతి వందమందిలో ఒకరిద్దరికే బ్లాక్‌ఫంగస్ వస్తుంది. తొలిదశలో గాంధీలో చికిత్సపొందిన 10 మందిలో దీన్ని గుర్తించాం. ఒకరిద్దరు మినహా అంతా చికిత్సకు కోలుకున్నారు. పౌష్టికాహారం తీసుకుని రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. ఆకుకూరలు, చేపలు, గుడ్లు, మాంసాహారం, సీ విటమిన్ ఎక్కువ లభించే పండ్లు తీసుకోవాలి.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment