సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణలోని రైల్వేల అభివృద్ధికి రూ. 4,418 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2009–14 మధ్య ఉమ్మడి ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు కేవలం రూ.886 కోట్లు కేటాయింపులు జరగ్గా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారు రూ. 12,800 కోట్లు కేటాయించామన్నారు. శుక్రవారం ఢిల్లీలోని రైల్ భవన్‌లో అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కాజీపేటలో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.
కాజీపేటలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు టెండర్లను పిలిచామని... త్వరలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఇందులోనే పీరియాడిక్ ఓవర్‌హాలింగ్, రిపేర్, మాన్యుఫ్యాక్చరింగ్ ఉన్నాయన్నారు. దేశంలో వ్యాగన్ ఓవర్ హాలింగ్‌కు డిమాండ్ ఉందని... కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఓవర్ హాలింగ్‌లకు మధ్య పెద్ద తేడా ఉండదన్నారు. అందువల్ల కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీని అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు.
ఇప్పటికే దేశంలో చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పారు. విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే ఉందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కాగా, కాజీపేటలో నెలకు 250 రైల్వే వ్యాగన్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి వాటి జీవితకాలాన్ని పెంచుతారు. దీనివల్ల దాదాపు 1,500 మందికి ఉపాధి కలుగుతుందన్న అంచనాలున్నాయి.
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే సహకరించడం లేదన్న విమర్శలను అశ్వనీ వైష్ణవ్ కొట్టిపారేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎంఎంటీఎస్‌కు రూ. 600 కోట్లు కేటాయించామని... ఎంఎంటీఎస్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వమే సహకరించట్లేదని ఆరోపించారు. రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం చేయాల్సింది చేస్తుందని...
మొదట ఎంఎంటీఎస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల తరహాలో 50 నుంచి 70 కి.మీ. దూరంలోని పట్టణాలను కలుపుతూ హైస్పీడ్ వందేభారత్ మెట్రో ప్రాజెక్టును త్వరలో పట్టాలెక్కించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment