RS Praveen Kumar Resignation: సాక్షి, హైదరాబాద్: సంచలనాలు, సంస్కరణలకు చిరునామా అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ– మెయిల్ ద్వారా సమాచారం అందించారు. సోమ వారం ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. మరో ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసు కోవడంపై పోలీస్ శాఖ, ప్రస్తుతం ఆయన కార్యదర్శిగా ఉన్న గురుకుల సొసైటీల్లో కలకలం రేపుతోంది. వ్యక్తిగత కారణా లతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఏడీజీ హోదాలో యూసఫ్‌గూడ బెటాలియన్‌లో ఉన్న కొందరు ఆత్మీయులు, ఐపీఎస్ మిత్రులను కలుసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటికొచ్చారు. తర్వాత కొద్దిసేపటికే తన వీఆర్‌ఎస్ నిర్ణయాన్ని వెలువరించారు.
రాష్ట్రవ్యాప్త గుర్తింపు..
ఉమ్మడి రాష్ట్రంలో ప్రవీణ్‌కుమార్ కరీంనగర్, అనంతపూర్ జిల్లాలకు ఎస్పీగా, హైదరాబాద్‌లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్), తర్వాత గురుకుల సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. కరీంనగర్ ఎస్పీ (2001 నుంచి 2004)గా పనిచేయడం ఆయనకు చాలా గుర్తింపు తెచ్చింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తూనే, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్న గ్రామంలోనే ఉండాలంటూ ఆయన ఇచ్చిన నినాదం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేసింది. ‘గురువా మా ఊర్లోనే ఉండు..’అన్న నినాదం జిల్లావ్యాప్తంగా ఉద్యమంగా మారింది. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు.
ఇదీ ఆయన నేపథ్యం..
పూర్తిపేరు: రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్
పుట్టింది: ఆలంపూర్, 1967
తల్లిదండ్రులు: ప్రేమమ్మ, బీఆర్ సవరన్న
విద్యార్హతలు: వెటర్నరీ సైన్స్‌లో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ నుంచి మాస్టర్స్, హార్వర్డ్, మసాచుసెట్స్ వర్సిటీల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్
అవార్డులు: పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, సెక్యూరిటీ మెడల్ (కేంద్ర హోం శాఖ), యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్ (వార్ క్రైం ఇన్వెస్టిగేటర్)
సమీప బంధువులు: మాజీ ఎమ్మెల్యే సంపత్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
పోలీసు వెబ్‌సైట్ సృష్టికర్త
హైదరాబాద్‌లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్)గా పనిచేసిన సమయంలో పోలీస్ శాఖలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. సైబర్ నేరాలు పెరుగుతుండటంతో సీసీఎస్‌లో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ఓ ఠాణా కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటి ఆధారంగానే ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్, సైబరాబాద్‌లకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయి. నగర పోలీస్ వెబ్‌సైట్, ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్, ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఫారినర్స్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తదితరాలకు శ్రీకారం చుట్టారు. పోలీసుల మధ్య ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సమాచార మార్పిడికి హోషియార్, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ డిలీట్ దెమ్ కార్యక్రమాలు ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే.
హుజూరాబాద్‌లో పోటీ చేసే ఉద్దేశం లేదు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని, రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం కుందన్‌బాగ్‌లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. వ్యక్తిగతంగా కొంత విశ్రాంతి కావాలని, 26 ఏళ్లు ప్రభుత్వ సర్వీసులోనే గడిచిపోయాయని, మిగిలిన విషయాలను పట్టించుకోలేదన్నారు. ఇకపై పూర్తిస్థాయిలో పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే పదవీ విరమణ చేశానని వెల్లడించారు. తాను వెళ్లిపోయినంత మాత్రాన గురుకులాల విద్యా సంస్థలకు వచ్చే ఇబ్బందేమీ లేదని వివరించారు. స్వేరోస్ తన సృష్టి కాదని, దాన్ని పూర్వ విద్యార్థులు స్థాపించారని, అందులో తాను అనుకోకుండా చేరానని చెప్పారు. స్వేరోస్‌లో లక్షలాదిమంది ఉన్నారని, దాంట్లో ప్రవీణ్ ఒకడని, తాను ఉన్నా లేకున్నా స్వేరోస్ ముందుకు సాగుతుందదని స్పష్టం చేశారు.
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 19, 2021
Comments
Please login to add a commentAdd a comment