సైదాబాద్: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడిచేసి హత్య చేసిన నిందితుడి మృతితో సింగరేణి కాలనీ ఊపిరిపీల్చుకుంది. వారం రోజులపాటు ప్రజాపోరాటాలతో దద్దరిల్లిన చోట ప్రశాంతత అలుముకుంది. రాజు మరణవార్తతో సింగరేణిలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం పలువురు బాలిక చిత్రపటాలతో జోహార్లు చెపుతూ నినాదాలు చేశారు.
సరిగ్గా వారం క్రితం...
గత గురువారం (9వ తేదీన) బాలికపై దారుణం జరగ్గా ఈ గురువారం నిందితుడు మరణించాడు. గత వారం సాయంత్రం కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతికారు. స్థానికులు కూడా వారికి తోడుగా నిలిచారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫొటోలు పోస్ట్ చేసి ఆచూకీ తెలపాలని అభ్యర్థించారు. రాత్రి 12 గంటలకు బాలిక నిందితుడి ఇంట్లో విగత జీవిగా కనపడింది. దాంతో ఒక్కసారిగా స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
నిందితుడికి కఠినశిక్ష పడాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. స్థానికులతో పాటు బాలిక కుటుంబానికి న్యాయం జరగాలంటూ కాంగ్రెస్, బీజేపీ, వైఎస్‌ఆర్‌టీపీ, జనసేన, బీఎస్పీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
(చదవండి: రాజును పోలీసులే చంపారు! నాకు, నా బిడ్డకు దిక్కెవరు?: మౌనిక)
ఫలించిన పోరాటల ఒత్తిడి..
వారం రోజుల ఆందోళనల తరువాత గురువారం ఉదయం మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌లు బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరుపున నష్టపరిహారం అందించారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. వారు వచ్చి వెళ్లిన రెండు గంటలకే నిందితుడి ఆత్మహత్య వార్త బయటకు వచ్చింది. దాంతో సింగరేణివాసులు తమ వారం రోజుల పోరాటానికి ఫలితం దక్కిందని ఊపిరిపీల్చుకున్నారు.
(చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: ఉన్మాది కథ ముగిసింది!)
ప్రభుత్వం ఆదుకోవాలి
బాలికపై పాశవికంగా హత్యాచారం చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకోవడం.. అతనికి పడిన తగిన శిక్షగానే భావిస్తున్నాం. అయితే బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకోవాలి.
– నగరిగారి దేవదాసు, సింగరేణికాలనీ
Comments
Please login to add a commentAdd a comment