సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మళ్లీ జన్మంటూ ఉంటే అమ్మాయిగానే పుడతామంటున్నారు నేటి మహిళలు. అబ్బాయికంటే అమ్మాయిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నా.. ఉన్నతాధికారిణిగా ఉన్నా.. పని ప్రదేశాల్లో వేధింపులు ఎదురవుతున్నా వాటని్నంటిని అధిగవిుస్తూ స్వతంత్రంగా జీవిస్తున్నారు. సొంతింట్లోనే ఆడ మగ వివక్ష ఉన్నా, సోషల్ మీడియా ద్వారా టీజింగ్ ఎదురవుతున్నా వాటిని అధిగవిుస్తూ ముందుకు సాగుతున్నారు. తమకు శిక్షించే అధికారం లభిస్తే మహిళలపై హింస, ఇతరత్రా నేరాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు.
ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వివిధ రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యారంగం, ఆర్టీసీ, పోలీసు, అంగన్‌వాడీ తదితర ప్రభుత్వ రంగాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, టీచర్లు ఈ సర్వేలో భాగస్వాములయ్యారు. నల్ల గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఒక్కో జిల్లాలో వంద మంది చొప్పున 300 మంది మహిళలు పాలు పంచుకున్నారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్ల డించారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలివే..
►మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 300 మంది మహిళలు,
ఉద్యోగినులు, విద్యార్థినులకు నాలుగు ప్రశ్నలు వేసి వారి అభిప్రాయాలను తీసుకున్నాము.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలి. తల్లిగా లాలిస్తూ, భార్యగా బాగోగులు చూస్తూ నిరంతరం పనిచేసే గొప్ప సేవకురాలు మహిళ. అలాంటి మహిళలు ఇంటికే పరిమితం కావద్దు. బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించి వివిధ రంగాల్లో రాణించాలి. అప్పుడే ఆయా రంగాలతోపాటు సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది.
– బి.సునీత, స్టాఫ్ నర్స్, సూర్యాపేట
చిన్న విషయాలకు నిరుత్సాహ పడొద్దు
ప్రతి చిన్న విషయానికి నిరుత్సాహానికి గురికావద్దు. మహిళ పుట్టుకతోనే శక్తివంతురాలు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ కుటుంబాన్ని, పిల్లలను ఒకస్థాయిలో నిలబెడుతుంది. మహిళలు చిన్న విషయాలకు కుంగిపోతే జీవితంలో ఏమీ సాధించలేరు. సోషల్ మీడియా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు దూరంగా ఉండాలి. చిన్న కారణాలకే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థినులను చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్య అయినా ఎదురొడ్డి నిలబడాలి.
– నళిని, హెల్త్ అసిస్టెంట్, నల్లగొండ
భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి
మహిళా దినోత్సవం జరుపుకోవడం అంటే ఆటలాడి, పాటలు పాడి కేకులు కోసి సంబరాలను జరుపుకోవడం కాదు. ఎవరో నలుగురికి శాలువాలు కప్పి సన్మానించడం అంతకంటే కాదు. ప్రతి మహిళ తన జీవితంలో సాధించిన ప్రగతిని సమీక్షించుకుని భవిష్యత్‌లో చేయాల్సిన అంశాలకు బాటలు వేసుకొని, వాటి అమలుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవడమే అసలైన మహిళా దినోత్సవం.
– ఉప్పల పద్మ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, మిర్యాలగూడ
ఉన్నత చదువులతోనే రాణింపు
సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే ఉన్నత చదువులు చదవాలి. ప్రభుత్వాలు మహిళల కోసం మరిన్ని చట్టాలను తీసుకురావాలి. మహిళలకు ఎన్నో చట్టాలు ఉన్నా ప్రస్తుతం ఎక్కడో ఒకచోట వివక్ష తప్పడం లేదు.
– మోహన, బీటెక్, ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, సూర్యాపేట
అన్నింటా సమానత్వం ముఖ్యం
ప్రతి ఒక్క రంగంలో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలి. లైంగిక దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉండాలి.
మహిళా స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వాలు పనిచేయాలి.
– కానుగు సాయి ప్రసన్న, ప్రైవేట్ ఉద్యోగిని, వంగపల్లి, యాదాద్రి జిల్లా
వివక్షలేని సమాజాన్ని నిర్మించాలి
మహిళలపై నేటి సమాజంలో వివక్ష ఎక్కువగా ఉంది. ప్రతి ఇంట్లో మగ పిల్లలు చెల్లి, అక్క, తల్లితో ఎలా మెలుగుతున్నారో బయట సమాజంలో కూడా అలానే ఉండేలా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. మహిళలపై వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
– కడియం రాజేశ్వరి, మహిళా కానిస్టేబుల్,
మిర్యాలగూడ వన్‌టౌన్
Comments
Please login to add a commentAdd a comment