రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో ఆవరణను చీపురుతో శుభ్రం చేస్తున్న ఉపాధ్యాయుడు
సాక్షి నెట్‌వర్క్ : విద్యార్థులు లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా సోమవారం సర్కారు బడులు తెరుచుకున్నాయి. అన్‌లాక్–4 నిబంధనల మేరకు 50 శాతం మంది టీచర్లు పాఠశాలలకు వచ్చారు. ఉపాధ్యాయులకు రోజు విడిచి రోజు డ్యూటీలు వేసిన విషయం తెలిసిందే. సగం మంది టీచర్లు సోమ, బుధ, శుక్ర వారాల్లో, మిగతా సగం మంగళ, గురు, శనివారాల్లో పాఠశాలలకు హాజరుకానున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులు సందేహాల నివృత్తి కోసం అవసరమైతే పాఠశాలలకు రావొచ్చని చెప్పినా... చాలాచోట్ల ఎవరూ రాలేదు. దాంతో పిల్లలు లేక బడులు వెలవెలబోయాయి. గైడ్‌లైన్స్ వచ్చేవరకు విద్యార్థులను అనుమతించొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండటంతో అక్కడక్కడ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులను తిప్పి పంపించినట్లు సమాచారం. స్కూలుకు వచ్చి న టీచర్లు... విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆన్‌లైన్ పాఠాలను పర్యవేక్షించారు. పాఠాలు వింటున్నారా? అర్థమవుతున్నాయా? లేదా? అని ఆరాతీశారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 283 పాఠశాలలకు గానూ 5,750 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2,875 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. ఆన్‌లైన్ పాఠాల్లోని సందేహాల నివృత్తికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నా విద్యార్థులెవరూ బడివైపు రాలేదు. మెదక్ జిల్లాలో మొత్తం 952 ప్రభుత్వ పాఠశాలలుండగా 3,265 మంది టీచర్లు పనిచేస్తున్నారు. కాగా 50 శాతం 1,633 మంది టీచర్లు హాజరయ్యారు. సంగారెడ్డిలో 1,451 పాఠశాలల్లో 2,200 మంది టీచర్లు బడులకు వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం 9, 10వ తరగతుల విద్యార్థులు ఎవరూ హాజరు కాలేదు. ఎప్పటిలాగే ఆన్‌లైన్ పాఠాలను విద్యార్థులు వీక్షించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి హైస్కూల్‌ను డీఈవో జనార్దన్‌రావు తనిఖీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులను పాఠశాలలకు అనుమతించవద్దని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 4,123 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఉన్న 852 ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో 2,100 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. నారాయణపేట జిల్లాలో కొంత మంది తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.
చీపుళ్లు పట్టిన టీచర్లు
ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను తొలగించడంతో ఉపాధ్యాయులకు కష్టాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో సోమవారం టీచర్లు.. స్వయంగా పాఠశాలలో ఊడ్చుకోవడం, నీళ్లు తెచ్చుకోవడం వంటి పనులు చేసుకున్నారు. ఆన్‌లైన్, టీశాట్/డీడీ యాదగిరి చానళ్ల ద్వారా విద్యార్థులకు చెబుతున్న పాఠ్యాంశాలను టీచర్లు పరిశీలించారు. ఇంటి దగ్గర ఉన్న టీచర్లు.. ఫోన్ ద్వారా సమన్వయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment