రెండేళ్ల కింద మొదలైన కరోనా వైరస్ దాడి ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా ఒక్కటే కాదు.. దీనికి ముందు పంజా విసిరిన సార్స్, మెర్స్ వంటి వైరస్‌లు గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించినట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. కానీ ఇక ముందు ఎలుకల నుంచి కూడా కరోనా వంటి వైరస్‌లు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆ పరిశోధన ఏమిటి, ప్రమాదం ఏమిటో తెలుసుకుందామా?
– సాక్షి సెంట్రల్ డెస్క్
గబ్బిలాల నుంచి వచ్చినట్టుగా..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (సార్స్ కోవ్–2) వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సోకినట్టు ఇప్పటికే గుర్తించారు. చైనాలో ఉండే హార్స్‌షూ రకం గబ్బిలాల్లో కరోనా వంటి వైరస్‌లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని.. ఆ గబ్బిలాలు వైరస్‌ను తట్టుకుని సహజీవనం చేస్తున్నాయని తేల్చారు. ఈ నేపథ్యంలోనే మనుషులకు దగ్గరగా ఉండే మరేవైనా జంతువులు, పక్షుల్లో ఈ తరహా పరిస్థితులు ఉన్నాయా, వాటి నుంచి మనుషులకు వైరస్‌లు వ్యాపించే ప్రమాదం ఉందా అన్న దానిపై అమెరికాకు చెందిన ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు.
జన్యుపరమైన పోలికలున్న జీవులతో..
మనుషులకు దగ్గరగా ఉండే కోతులు, చింపాంజీలతోపాటు ఇతర జంతువుల్లో.. కరోనా వంటి వైరస్‌ల ప్రభావానికి లోనయ్యే వాటిని శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు. వాటి శరీరకణాల్లో ఏసీఈ–2 రిసెప్టార్ల (కరోనా వైరస్‌లు శరీర కణాలకు అతుక్కునేందుకు కారణమయ్యే ప్రోటీన్) తీరును పరిశీలించారు. ఆ జంతువులు కరోనాకు ఎంతగా ప్రభావితం అవుతున్నాయి? ఎలా ఎదుర్కొంటున్నాయి? లక్షణాలు ఎలా ఉంటున్నాయి? అన్నది క్షుణ్నంగా గమనించారు.
మిగతా అన్ని జంతువుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తూ, ఆ వైరస్‌తో పోరాడుతుంటే.. ఎలుకలు మాత్రం వైరస్‌ను తట్టుకుంటున్నట్టు గుర్తించారు. ఈ ఎలుకలు కరోనా వంటి వైరస్‌ల ప్రభావానికి లోనుకాకుండా వాటిలోని ఏసీఈ–2 రిసెప్టార్లు పరిణామం చెందినట్టు తేల్చారు.
వైరస్‌లకు రిజర్వాయర్లుగా..
ఈ ఎలుకల ముందు తరాలు తరచూ కరోనా వంటి వైరస్‌ల దాడికి గురవడంతో.. వాటిని తట్టుకునేశక్తిని పెంచుకున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రాఫెసర్లు షీన్ కింగ్, మోనా సింగ్ వెల్లడించారు. అందువల్లే శరీరంలో వైరస్ పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా.. ఆ ఎలుకల్లో ఎటువంటి లక్షణాలు, అనారోగ్యం కనిపించడం లేదని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల వల్ల ఎలుకలు సదరు వైరస్‌లకు నిలయం (రిజర్వాయర్లు)గా మారిపోతాయని.. భవిష్యత్తులో ఆ వైరస్‌లు మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఒక్క ఎలుకలనే కాకుండా.. మరికొన్ని రకాల జంతువులు, పక్షులు కూడా ఇలా పరిణామం చెంది ఉండవచ్చని.. అలాంటి వాటిని గుర్తిస్తే భవిష్యత్తులో ముందు జాగ్రత్తలకు వీలవుతుందని స్పష్టం చేశారు.
జూనోటిక్ వ్యాధులే ఇలా..
సాధారణంగా జంతువులు, పక్షుల్లో ఉండే వైరస్‌లు.. ఇతర జంతువులు/పక్షులు, మనుషులకు వ్యాపించడం వల్ల వచ్చే వ్యాధులను జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఈ వైరస్‌లు ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించే క్రమంలో.. కొన్నిరకాల జంతువులపై ఎక్కువగా, మరికొన్ని రకాలపై తక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఇది ఆయా జంతువుల్లో వైరస్‌ల పట్ల నిరోధకత, జన్యుపరిణామం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
♦జంతువులు ఎక్కువకాలం ఏదైనా వైరస్/ఇతర సూక్ష్మజీవుల దాడికి గురవుతూ ఉంటే.. తమను రక్షించుకునేలా శరీరంలో మార్పులు చేసుకుంటుంటాయి. వాటి తర్వాతి తరంలో ఈ మార్పులు మరింతగా పెరుగుతాయి. అలా అలా సదరు వైరస్/సూక్ష్మజీవులను తట్టుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది.
♦మనుషుల్లో కూడా ఇదే తరహాలో ఇప్పటికే ఎన్నో రకాల వైరస్‌లు/సూక్ష్మజీవులను తట్టుకునే శక్తి సమకూరింది. కరోనా వైరస్ దాడి ఇలాగే సాగితే.. భవిష్యత్తులో అది ఒక సాధారణ జలుబు స్థాయికి మారిపోతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment