సింగరేణి ఆస్పత్రిలోని కరోనా పేషెంట్ల వార్డు
సాక్షి, హైదరాబాద్/ సింగరేణి (కొత్తగూడెం): సింగరేణిలో కోవిడ్‌ను కట్టడి చేసేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యం, ప్రభుత్వ యంత్రాంగం, గుర్తింపు యూనియన్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) సంయుక్తంగా చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. యాజమాన్యం, కార్మికులను సమన్వయం చేయడంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు టీజీబీకేఎస్ వర్గాలు వెల్లడించాయి. మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ సీఎండీ శ్రీధర్ అధికారులతో సమీక్షిస్తూ తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సంస్థలో 44 వేల మంది కార్మికులు ఉన్నారు. సింగరేణివ్యాప్తంగా ప్రస్తుతం 2,308 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, వారిలో 783 మంది కార్మికులు, 1,121 మంది కార్మి క కుటుంబీకులు, 364 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబాల్లో 27 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తి కాగా, మరో 50 వేల మందికి వేయాల్సి ఉంది.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.38 కోట్లు
కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న 867 మందికి హై దరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవల కోసం ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం రూ.38 కోట్లు వెచ్చించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు, సింగరేణి ఆసుపత్రుల్లో 1,400 బెడ్లతో ప్రత్యేక కరోనా వార్డుల ఏర్పాటుకు రూ.3.16 కోట్లు ఖర్చు చేసింది. 1.2 లక్షలకు పైగా టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేయగా, ఇప్పటివరకు 90 వేల మందికి పైగా కార్మికులు, వారి కుటుంబసభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కరోనా ప్రత్యేక వార్డులు, ఐసోలేషన్ సెంటర్లలో చేరిన 9,650 మంది పూర్తిగా కోలుకోగా, రూ.80 లక్షల ఖర్చుతో వివిధ మందులు, ఆక్సీమీటర్లు వంటి 18 వస్తువులతో కూడిన కిట్లను హోం ఐసోలేషన్ వారికి అందజేశారు. సింగరేణి లో అవసరమైన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, ఇతర మందులను రూ.5.55 కోట్లతో సమకూర్చారు.
ఐదు చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి
రూ.3.6 కోట్లతో ఐదు చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి కేం ద్రాలు ఏర్పాటు చేశారు. రూ.1.18 కోట్లతో 370 ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేశారు. కోవిడ్ వార్డుల్లో పనిచేసేందుకు 35 మంది అదనపు డాక్ట ర్లు, 126 మంది నర్సులు, 260 మంది సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారు. రోగులకు పౌష్టికాహారం అందిచేందుకు రూ.1.5 కోట్లు వెచ్చించడంతో పాటు సంస్థలో పనిచేసే వారికి శానిటైజర్, మాస్కులు, పీపీపీ కిట్లు అందజేశారు. కోవిడ్‌తో మృతి చెందిన 39 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించారు.
సత్ఫలితాలు సాధించాం
కరోనా నుంచి సింగరేణీయులందరినీ కాపాడుకునేందుకు అంతా సమష్టిగా పనిచేయాలని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరాం పిలుపునిచ్చారు. ఏడాదిగా సీఎండీ మార్గనిర్దేశంలో కోవిడ్‌పై సాగిస్తున్న పోరాటంలో సత్ఫలితాలను సాధించామన్నారు.
మెరుగైన సేవలు అందేలా చూస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత
కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, కార్మికులను సమన్వయం చేస్తూ రోగులకు అండగా ఉంటున్నాం. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు, క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, వ్యాక్సినేషన్ పక్రియ వరకు అన్ని దశల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం క్రియాశీలకంగా పని చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment