సాక్షి, పంజగుట్ట: సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి బంధువులకు మృతిచెందాడని సమాచారం ఇచ్చారు. తీరా శ్వాస తీసుకోవడం గమనించి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పల్స్ చెక్ చేయగా 95 చూపించింది. వారు నిర్ఘాంతపోయి ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. బాధితుల కథనం మేరకు సనత్‌నగర్‌కు చెందిన మహేందర్ అనే వ్యక్తి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతన్ని మొదట ఈసీఐఎల్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు అడ్మిట్ చేసుకోలేదు. అక్కడ నుంచి సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చి గత మూడు రోజుల క్రితం అడ్మిట్ చేశారు.
వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా చికిత్స కోసం వారు అప్పటికే రూ.3.5 లక్షలు చెల్లించారు. శనివారం మధ్యాహ్నం మహేందర్ చనిపోయాడని చెప్పి వెంటిలేటర్ తొలగించి బయటకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు రోధిస్తూ వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా మహేందర్ శ్వాస తీసుకోవడాన్ని గమనించి వెంటనే పల్స్ చూడగా బతికే ఉన్నాడని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బతికున్న రోగిని చనిపోయాడని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు ధర్నాకు దిగి ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించి మహేందర్‌ను తిరిగి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.
చదవండి: Hyderabad Rains: మళ్లీ కుమ్మేసిన వాన.. ఎక్కడ ఏమైందంటే!
Comments
Please login to add a commentAdd a comment