సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రెండో రోజు సమావేశాల్లో కీలకమైన 4 బిల్లులకు తిరిగి ఆమోదం లభించింది. అసెంబ్లీ గతంలోనే పురపాలక శాసనాల చట్టం (సవరణ) బిల్లు, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ)బిల్లు, రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన, క్రమబద్దీకరణ) సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట (సవరణ) బిల్లులను పాస్ చేసింది. ప్రభుత్వం వాటిని గవర్నర్ తమిళిసైకి పంపించినా ఆమోదముద్ర వేయలేదు.
ఆయా బిల్లుల్లోని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పిపంపేశారు. ఈ క్రమంలో ఆ నాలుగు బిల్లులను పునః పరిశీలించాలంటూ సంబంధిత మంత్రులు శుక్రవారం రాత్రి శాసనసభలో ప్రతిపాదించగా ఆమోదం లభించింది. శాసనసభ రెండోసారి పాస్ చేసి పంపుతున్న నేపథ్యంలో ఈ బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఉదయం నుంచి ప్రశ్నోత్తరాలు, లఘు చర్చలతో
శుక్రవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ, ఉద్యాన అభివృద్ధి సంస్థ, విద్యుత్ సరఫరా సంస్థ, ఉపాధ్యాయుల బదిలీ ల నియమావళి, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ, అటవీ అభివృద్ధి సంస్థల నివేదికలను సంబంధిత మంత్రులు సభకు సమర్పించారు. తర్వాత ప్రశ్నోత్తరాలు నిర్వహించారు.
ఎజెండాలో పది ప్రశ్నలు ఉన్నప్పటికీ సమయాభావం కారణంగా.. ఐటీ ఎగుమతులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, ఆరోగ్య లక్ష్మి పథకం తదితర అంశాలపైనే మంత్రులు సమాధానాలిచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు కె.విజయరామారావు (ఖైరతాబాద్), కొమిరెడ్డి రాములు (మెట్‌పల్లి), కొత్తకోట దయాకర్‌రెడ్డి (మక్తల్), సోలిపేట రామచంద్రారెడ్డి, (దొమ్మాట), చిల్కూరి రామచంద్రారెడ్డి (ఆదిలాబాద్) మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.
ఇటీవల సంభవించిన వరదలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ఇచ్చిన వాయిదా తీ ర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. జీరో అవర్ తర్వాత మధ్యాహ్నం 12.05కి స్పీకర్ టీబ్రేక్ విరా మం ఇవ్వగా.. సభ తిరిగి 12.50కి సమావేశమైంది.
వరదలు, విద్య, వైద్యారోగ్యంపై లఘు చర్చ
రెండో రోజు సమావేశం ఎజెండాలో భాగంగా రెండు అంశాలపై లఘు చర్చ జరిగింది. భారీ వర్షాలు, వరదల నష్టం, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై జరిగిన చర్చకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం స్పందించలేదంటూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
తర్వాత రాష్ట్రంలో విద్య, వైద్యారోగ్య రంగాలపై చర్చను ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ప్రా రంభించారు. దీనిపై రాత్రి 8 వరకు సభ్యుల ప్రసంగాలు కొనసాగాయి. తర్వాత మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు ఆయా అంశాలపై సమాధానాలిచ్చారు. రాత్రి 10.20 వరకు సమావేశం కొనసాగగా.. కీలక బిల్లులను ఆమోదించాక శనివారం ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
గవర్నర్ తిరస్కరించడంతో..
అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడతామని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తెలిపింది. అందులో గవర్నర్ తిప్పిపంపిన నాలుగు బిల్లులను శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ) బిల్లును మంత్రి హరీశ్‌రావు, ప్రైవేటు వర్సిటీల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ బిల్లును ఎర్రబెల్లి దయాకర్‌రావు సభకు సమర్పించారు. వాటిని పునః పరిశీలించి ఆమోదించాలని కోరారు.
ఈ బిల్లులను తిరస్కరిస్తూ గతంలో గవర్నర్ కార్యాలయం నుంచి మూడు సందేశాలు అందాయని ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వీటిపై సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక.. బిల్లులను సభ ఆమోదించినట్టు ప్రకటించారు. ఇక శనివారం సభలో ‘తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
సభ్యులు సభలో ఉండాలి: కేటీఆర్
శాసనసభ సమావేశాలను 30 రోజులు జరపాలని బీజేపీ, 20 రోజులు జరపాలని కాంగ్రెస్ కోరాయని.. కానీ చర్చల సమయంలో ఆ పారీ్టల సభ్యులు సభలో ఉండటం లేదని మంత్రి కేటీఆర్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభలోకి రాగా.. ‘‘శ్రీధర్ బాబుగారికి వెల్కమ్. శాసన సభ్యులు కచ్చితంగా సభలో ఉండేలా చూడాలి. సభలో ఉండి సమాధానాలు వినాలి. బయటికి వెళ్లి అటూ ఇటూ తిరగడం, మీడియాతో మాట్లాడడం సరికాదు’’అని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ.. తనతోపాటు రఘునందన్‌రావు బీజేపీ తరఫున ఉన్నారని పేర్కొన్నారు.
దీంతో బీజేపీ నుంచి సస్పెండైన మీరు ఆ పార్టీ ఎమ్మెల్యే కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీరు సంగారెడ్డి వరకు మెట్రో కోరితే.. మేం ఇస్నాపూర్ వరకు మంజూరు చేసినా అభినందించడం లేదు. సంగారెడ్డి, ములుగు, పెద్దపల్లిలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. ప్రభుత్వాన్ని అభినందించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబులకు మనసు రావడం లేదు..’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment