ఆసియాలోనే అతి పెద్ద కాలనీగా రూపొందిన కేపీహెచ్‌బీ కాలనీ నగరంలోనే ప్రసిద్ధిగాంచిన నివాస ప్రాంతంగా ఏర్పడింది. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు స్థానమున్న ఈ కాలనీలో గంజి, బెంజి మిళితమై నివాసకేంద్రంగా ఉండటం విశేషం. ఒకప్పుడు రాళ్లూ రప్పలు, చెట్టూ చేమలతో చిట్టడవిగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఆకాశ హర్మ్యాలకు చిరునామాగా మారింది. విభిన్న సంస్కృతుల మేళవింపుతో దేశ, విదేశాల వారికి ఆవాసంగా ఉంది. మహా నగరానికే మణిమకుటంగా వెలుగొందుతోంది కేబీహెచ్‌బీ కాలనీ. దాని ప్రస్థానమిదీ..
1969లో 1,326 ఎకరాలను అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. 1978లో హౌసింగ్ బోర్డు పేద, మద్య తరగతి ప్రజలకు నివాసం కోసం నో లాస్, నో ప్రాఫిట్ పేరుతో ఇళ్ల నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది. హుడా నిబంధనల ప్రకారం 40 శాతం ఖాళీ స్థలాలను వదిలి మిగిలిన ప్రాంతాన్ని ప్లాట్లుగా విభజించింది. అనంతరం 1981– 82 ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పట్లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఇళ్లు లేని వారు ఎంతోమంది హౌసింగ్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు.
- మొదట్లో కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్– 1, ఫేజ్– 2 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అప్పటికి దరఖాస్తులు మిగిలిపోవటంతో 3, 4 ఫేజుల నిర్మాణం చేపట్టింది. అప్పట్లోనే 100 ఎకరాల స్థలాన్ని జేఎన్‌టీయూకు కేటాయించింది. అనంతరం 5వ, 6వ ఫేజులో హెచ్‌ఐజీల పేరుతో పెద్ద ప్లాట్లను వేలం వేసింది. లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లు కేటాయిస్తూ హౌసింగ్ బోర్డు నిర్ణయం తీసుకొంది. 15 ఫేజుల్లో లాటరీ పద్ధతిలో కమర్షియల్ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. హౌసింగ్ బోర్డుకు గుండె లాంటి కూకట్‌పల్లిలో హౌసింగ్ బోర్డు ఆదాయం సమకూర్చుకునేందుకు బహిరంగ వేళాన్ని ప్రోత్సహించింది. దీంతో పోటాపోటీగా స్థలాల విక్రయాలు జరిగాయి.
స్పైనల్ రోడ్డుతో మహర్దశ..
కూకట్‌పల్లి నుంచి కేపీహెచ్‌బీ మీదుగా హైటెక్ సిటీ వరకు 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పైనల్ రోడ్డు నిర్మాణం కోసం చేసిన శంకుస్థాపన ఈ రోజు వేలల్లో ఉన్న సామాన్యులను కోటీశ్వరులుగా చేసింది. స్పైనల్ రోడ్డుకు ముందు 10 వేల రూపాయలకు ఇళ్లు కొనాలన్నా హడలిపోయే ప్రజలు స్పైనల్ రోడ్డు నిర్మాణంతో గజం లక్ష రూపాయలకు చేరింది. అప్పట్లో రాష్ట్రంలోనే హౌసింగ్‌బోర్డు వేసిన వేలంలో గజం ధర లక్ష రూపాయలకు పలకటం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఒకవైపు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, మరోవైపు మెట్రో రైల్వే స్టేషన్, ఇంకో వైపు హైటెక్ సిటీకి వెళ్లే హైస్పీడ్ రహదారి, మరో వైపు స్పైనల్ రోడ్డు నిర్మాణంతో హౌసింగ్ బోర్డు దశ మారిపోయింది. రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రంగా కూకట్‌పల్లి ప్రఖ్యాతి గాంచింది. దీనికి తోడు ప్రతిష్టాత్మకమైన జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఇక్కడే ఉండటంతో జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలలు కూడా సమీపంలోనే ఉండటంతో ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది.
సకల సౌకర్యాలకు నెలవు..
తెలంగాణలోనే మొట్టమొదట గేటెడ్ కమ్యూనిటిల నిర్మాణం కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభమయ్యాయి. అత్యంత ఎత్తైన 42 అంతస్థుల భవన నిర్మాణాలు చోటుచేసుకోవటమే కాకుండా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఇక్కడ నిర్మాణం కావటంతో ఈ ప్రాంతానికి మహర్దశ పలికింది. ప్రభుత్వం 50 శాతానికిపైగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. కొన్ని డ్లూప్లెక్స్ నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా లోదా కాలనీ, రెయిట్‌ట్రీ పార్కు (మలేసియా టౌన్ షిప్), హిందూ ఫార్చ్యూన్, వన్ సిటీ కాలనీ వంటి ప్రాంతాలు అధునాతనంగా నిర్మించటంతో అధిక శాతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఈ ప్రాంతం పట్ల ఆకర్షితులయ్యారు.
హైటెక్ సిటీకి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ రోడ్లు్ల, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ప్లే గ్రౌండ్స్, క్లబ్ హౌస్, మీటింగ్ హౌస్‌లను ఏర్పాటు చేయటంతో సామాన్యుడితో పాటు కోటీశ్వరులకు కూడా కావాల్సిన వస్తువులు అందుబాటులో లభిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, సినీ రంగ ప్రముఖులు కూడా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ ఒకవైపు ఓఆర్‌ఆర్ సమీపంలో ఉండటమే కాకుండా ముంబై జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో ఈ ప్రాంతం మరో అబిడ్స్‌ను తలపిస్తోంది. ఇక్కడ అక్షరాలా లక్షకు పైగా జనాభా నివాసం ఉంటారంటే అతిశయోక్తి లేదు.
అతిపెద్ద నివాస కేంద్రం..
కూకట్‌పల్లికి చుట్టు పక్కల పారిశ్రామిక ప్రాంతాలైన సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం, బొల్లారం, పటాన్ చెరు, కాజిపల్లి, బొంతపల్లి ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొనటంతో ఇక్కడి కారి్మకులకు నివాస యోగ్యమైన ప్రాంతంగా కేపీహెచ్‌బీ అవతరించింది. దీంతో ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ పెరిగింది. మాదాపూర్, గచి్చబౌలి ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు రావటంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడే బీహెచ్‌ఇయల్ ఆర్ అండ్, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, ఎంఎస్‌ఎమీ, బీహెచ్‌ఈఎల్, ఐడీపీఎల్, ఐడీఎల్, బీడీఎల్ ప్రభుత్వరంగ సంస్థలు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని నివాస కేంద్రంగా ఏర్పరచుకున్నారు.
కోస్తాంధ్రవాసులకు అడ్డా..
నగరంలో నూతనంగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా, సామాన్యుడికి అవసరమయ్యే ఇళ్లు అద్దెకు కావాలన్నా ఇతర ప్రాంతాల నుంచి వలస వచి్చన ప్రజలు ఈ ప్రాంతాన్నే ప్రధాన అడ్డాగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇక్కడ విద్యారంగంతో పాటు వ్యాపార రంగం, కార్మికరంగం, ప్రజలు ఎక్కువగా నివాసముంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు కూడా ఈ ప్రాంతంలోనే నివాసముంటూ జీవనోపాధికి బాటలు వేసుకుంటున్నారు. ఇక్కడ నివాసముంటూ హాస్టళ్లలో బ్యాచ్‌లర్స్ జీవితాలను గడుపుతూ ఏదో ఒక రంగంలో ఉపాధి వెదుక్కొని ఇక్కడే వివాహం చేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకోవటం విశేషం.
కోస్తా, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల వారు ఇక్కడే నివాసం ఉండటంతో ఆ ప్రాంతానికి సంబంధించిన హోటల్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవటం విశేషం. గుంటూరు గోంగూర, రాగి సంకటి, నాటు కోడి పులుసు, గోదావరి ఘుమఘుమలు, రొయ్యల పులుసు, పాలమూరు చికెన్ గ్రిల్స్, హైదరాబాద్ బిర్యానీతో పాటు అన్ని వంటలకు కేరాఫ్‌గా ఈ ప్రాంతం నిలిచింది. ఇక్కడ సకల సౌకర్యాలు లభించటంతో కేవలం కేపీహెచ్‌బీ ప్రాంతంలోనే వెయ్యికి పైగా హాస్టల్స్ ఏర్పడటం విశేషం. ఇలా.. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద ఆదాయ వనరుగా ఏర్పడటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment