సనత్‌నగర్: వాహనం ఎక్కి వినాయకుడు నిమజ్జనానికి తరలడం కాదు.. నిమజ్జన వాహనమే గణేషుడి చెంతకు వచ్చే సరికొత్త విధానానికి ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ నాంది పలికింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఆ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు ‘ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. తొలిసారిగా ప్రయోగాత్మకంగా కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ల నివాసితులకు ఈ సేవలను అందించనున్నారు.
వీటిని శుక్రవారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాహనాలపై ఏర్పాటుచేసిన నీటి తొట్టెలో వినాయకుడి విగ్రహాన్ని మంత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి ముందే వినాయకుడి నిమజ్జనం చేసేవిధంగా వాహనాలను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ వాహనాలను అవసరాలను బట్టి వచ్చే ఏడాది మరిన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్‌సాగర్, ఫ్రీడమ్ ఆయిల్ మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment