
అజయ్‌కుమార్ (ఫైల్)
మానవపాడు: పలకా, బలపంతో పాఠశాలకు వెళ్లిన బాలుడికి మొదటి రోజే స్కూల్ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. మూడేళ్ల ప్రాయంలోనే నూరేళ్లు నిండిపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో సోమవారం ఈ హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. చంద్రశేఖర్‌నగర్ గ్రామం శ్రీనగర్ కాలనీకి చెందిన మహేశ్, సూర్యబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. మహేశ్ ఏపీలోని కర్నూలులో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు.
తమ ఇద్దరు కొడుకులు అభి, అజయ్‌కుమార్ (3)లను పాఠశాలలో చేర్పించేందుకు రెండు రోజుల క్రితం వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో రూ.4 వేలు ఫీజు కట్టి వచ్చారు. సోమవారం ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపారు. తరగతులు పూర్తయ్యాక బస్సులో అజయ్ ఇంటి వద్దకు వచ్చాడు.
బస్సు దిగి రోడ్డుకు ఆవలివైపు ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు వస్తుండగా తల్లి గమనించి ‘బస్సు ముందు బాబు ఉన్నాడు’ ఆపమని కేకలు వేస్తున్నా.. గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో అజయ్ బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కాగా.. న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని తరలించకుండా రాత్రి 8 గంటల వరకు సంఘటనాస్థలంలోనే ఉంచారు. పోలీసులు శాంతింపజేయడంతో మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.