వరంగల్ : ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కింద పడిన ఓ విద్యార్థిని ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే హసన్‌పర్తికి చెందిన లిక్కి శంకర్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు అక్షయ(13), కుమారుడు ఉన్నారు.
ప్రస్తుతం గొల్లపల్లి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. నగరంలోని వరంగల్ పబ్లిక్ స్కూల్‌లో అక్షయ 8వ తరగతి చదువుతోంది. ఈనెల 21న అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
అవయవాల దానం
అక్షయ అవయవాలను దానం చేశారు. కిమ్స్ ఆస్పత్రి వైద్యసిబ్బంది నేత్రాలతో పాటు ఇతర అవయవాలను సేకరించారు.
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
అశ్రునయనాల మధ్య అక్షయ అంతిమయాత్ర సాగింది. పార్థివదేహం ఇంటికి చేరుకున్న సమాచారం అందుకున్న పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్షయ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో తెలివి గల విద్యార్థినిగా ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు. అనంతరం హసన్çపర్తిలో శ్మశాన వాటికలో అక్షయ అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment