దారి తప్పుతున్న ఆన్‌లైన్‌ క్లాసులు.. త‘స్మార్ట్‌’ జాగ్రత్త అని అంటున్న పోలీసులు | Students Are Misusing Mobile Phones In The Name of Online Classes | Sakshi
Sakshi News home page

వేరే అంశాలపై దృష్టి పెడుతున్న పిల్లలు

Published Mon, Jun 21 2021 7:57 AM | Last Updated on Mon, Jun 21 2021 7:58 AM

Students Are Misusing Mobile Phones In The Name of Online Classes - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

‘హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న గ్రామానికి చెందిన బాలిక(13)కు ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు తల్లిదండ్రులు స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చారు. సదరుబాలిక పాఠాలు వింటూనే.. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇదే క్రమంలో ఫేస్‌బుక్‌ ద్వారా కరీంనగర్‌కు చెందిన బాలుడి(16)తో పరిచయం ఏర్పడింది. తరచూ చాటింగ్‌ చేసింది. ఓరోజు కరీంనగర్‌ రావాలని అబ్బాయి కోరడంతో ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది. కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు మొయినాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్, సీసీ కెమెరాల ఆధారంగా బాలిక కరీంనగర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకుని బాలికతో పాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు పోలీసులు.’ ‘కరీంనగర్‌లోని కమాన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న బాలుడు(15) ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు తల్లిదండ్రుల ఫోన్‌ వినియోగిస్తున్నాడు. క్లాసులతో పాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. వివిధ వెబ్‌సైట్లు, అసభ్యకర చిత్రాలు, ఫొటోలు ఎవరికి తెలియకుండా చూస్తున్నాడు. ఒక రోజు చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం బాలుడి తండ్రి ఫోన్‌ చూడగా.. అశ్లీల వెబ్‌సైట్‌ ఓపెన్‌చేసి ఉంది. బాలుడిని మందలించిన తండ్రి కేవలం తరగతులు వినేప్పుడే ఫోన్‌ ఇస్తున్నాడు.’

కరీంనగర్‌క్రైం: కరోనా విజృంభిస్తున్న సమయంలో పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడొద్దని సర్కారు ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతి ఇచ్చింది. గతేడాది నుంచే ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తుండగా.. ప్రతీ చిన్నారికి స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరి అయ్యింది. తల్లిదండ్రులు సైతం పిల్లల చదువులే ముఖ్యమనే ఉద్దేశంతో ఫోన్లు ఇస్తున్నారు. చిన్నారులు క్లాసుల అనంతరం ఏం చేస్తున్నారనే అంశాన్ని పేరెంట్స్‌ గమనించడం లేదు. దీంతో చాలా మంది చిన్నారులు తెలియని వయసులోనే సోషల్‌ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. చిన్న వయసులోనే తప్పటడుగులు వేస్తూ.. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.

గమనిస్తూ ఉండాలి..
గతేడాది కరోనా మొదటివేవ్‌ నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు సాగుతున్నాయి. సెకండ్‌వేవ్‌ ప్రభావం తగ్గడంతో పాఠశాలలు తెరవాలని సర్కారు సూచించగా.. మళ్లీ కేసులు పెరిగితే.. ఆన్‌లైన్‌ క్లాసులే నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ సమయంలో పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాలని పోలీసుశాఖ వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌లో వివిధ యాప్‌లు ఏదోఒక రకంగా అశ్లీలతతో పలుకరిస్తూనే ఉంటాయని, ఈ సమయంలో ఒంటరిగా క్లాసులు వింటున్న పిల్లలు త్వరగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తద్వారా విద్యార్థులు చదువును పక్కనబెట్టి, అడ్డదారులు తొక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. మరికొంత మంది పిల్లలు వివిధ రకాల గేమ్స్‌ డౌన్‌లోడు చేస్తుంటారు. తరువాత ఆ గేమ్‌లకు ఆకర్షితులయ్యే చిన్నారుల ఫోన్లకు కేటుగాళ్లు లింక్స్‌ పంపిస్తారు. లిక్స్‌ను పిల్లలు ఓపెన్‌ చేస్తూ.. గేమ్‌ ఆడుతుంటారు. ఆ సమయంలో సెల్‌ఫోన్‌ ద్వారా అకౌంటులో డబ్బులు ఖాళీఅయ్యే సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి. గతేడాది నుంచి ఇలాంటి సంఘటనలు జిల్లాలో పెరిగిపోయాయి. తల్లిదండ్రులు పిల్ల లకు ఆన్‌లైన్‌ తరగతులు వినేప్పుడు మాత్రమే మొబైల్‌ ఇవ్వడం మేలని, మొబైల్‌ వాడుతున్నంత సేపు వారిపై కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ ప్రమాదాలు..
అనేక పుస్తకాలు ఆన్‌లైన్‌లో లభ్యమవుతుంటాయి. చదవాలని తెరవగానే కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలోకి వైరస్‌ చొరబడి సైబర్‌ నేరగాళ్లు సదరు కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ల సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు మాల్‌వెర్టిసింగ్‌తో దోచేస్తున్నారు.
 సైబర్‌ స్టాకింగ్‌ చేస్తూ, మహిళలను లైంగికంగా వేధించడం. ఆడవాళ్ల ఫోన్‌నంబర్లు, ఈ మెయిల్‌ సేకరించి వేధింపులకు గురిచేస్తుంటారు.
 సైబర్‌ టీజింగ్‌తో బాలికలను, విద్యార్థులను వేధించడంతో వారి తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు.
 సైబర్‌ బుల్లీయింగ్‌ వల్ల నేరస్తులు ఇలాంటి పిల్లలతో స్నేహం పెంచుకుని మొదట్లో సైలెంట్‌గా ఫ్రెండ్‌షిప్‌ కొనసాగిస్తూ.. అశ్లీల పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తుంటారు.

ఇవి చేస్తే మేలు
 పిల్లలు తమ గదుల్లో కాకుండా అందరు తిరిగే ప్రదేశంలో ఫోన్లు, కంప్యూటర్లు వాడేలా చూసుకోవాలి. ఇంటర్నెట్‌తో కలిగే నష్టాలపై అవగాహన   పెంచాలి.
 వ్యక్తిగత సమాచారం, ఫొటోలు ఇంటర్నెట్‌లో పెట్టకుండా చూసుకోవాలి. బ్యాంకులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు, పిన్‌నెంబర్లు కంప్యూటర్‌లో పెట్టుకోకుడదు.
 ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ఉన్న కెమెరాలను అవసరమయినప్పుడే వాడుకోవాలి. వాడని సమయంలో సంబంధిత కెమెరాలు ఆఫ్‌ చేయాలి. 
 ఆన్‌లైన్‌లో కనిపించినవన్నీ చూడకూడదు. పుస్తకాలు తెరవకూడదు. నమ్మదగిన ప్రాచూర్యం పొందిన వెబ్‌సైట్‌లు జాగ్రత్తగా వాడుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement