విద్యార్థులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా పలువురు విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా, శుక్రవారం వీరి సంఖ్య పెరగడం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం జరగడంతో తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులకు స్థానిక వైద్య సిబ్బంది చికిత్స చేశారు. అయితే, విద్యార్థులు అస్వస్థతకు గురికావటానికి గల కారణాలు స్పష్టంగా తెలియడంలేదు. విద్యార్థులకు మెనూ ప్రకారం బుధవారం చికెన్ వడ్డించగా, అది తిన్నాక కడుపునొప్పి, వాంతులు అయ్యాయని విద్యార్థులు చెబుతున్నారు. కానీ ఇటీవల విద్యార్థులు సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చినప్పుడు తెచ్చుకున్న పిండి వంటలు తినడంతోనే ఇలా జరిగిందని ప్రిన్సిపాల్ చంద్రబాబు వివరణ ఇచ్చారు.
విద్యార్థుల పరిస్థితిపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాలతి పాఠశాలకు వచ్చి మెడికల్ ఆఫీసర్ కిషోర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో పిండివంటలతో పాటు భోజనం తయారీలో వాడే సరుకుల శాంపిళ్లను సేక రించారు. విద్యార్థులకు చికిత్స కొనసాగుతోందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని డీఎంహెచ్‌ఓ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment