కరీంనగర్ అర్బన్: పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే రాయితీ వంట ఇంధనం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. సబ్సిడీ గ్యాస్‌ను కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా మినీ సిలిండర్లలో నింపుతూ పెద్ద దందా సాగిస్తున్నారు. సబ్సిడీ సిలిండర్లను కొంతమంది బ్లాక్‌లో కొనుగోలు చేసి అందులోని ఇంధనాన్ని మినీ సిలిండర్లలో నింపి విక్రయిస్తున్నారు. రీఫిలి్లంగ్ ద్వారా ఒక్కో సిలిండర్‌కు అందనంగా రూ.వెయ్యి సంపాదిస్తున్నారు. జిల్లాలో మినీ గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పట్టని హోంనీడ్స్ దుకాణాల నిర్వాహకులు మినీ సిలిండర్లలో గ్యాస్ నింపి విక్రయాలు కొనసాగిస్తున్నారు. మినీ సిలిండర్ సైజ్‌ను బట్టి డబ్బులు గుంజుతున్న నిర్వాహకుల ఆగడాలకు కళ్లెం వేసేవారే కరువయ్యారు.
జిల్లా కేంద్రంలోని రాంనగర్, మంకమ్మతోట, గణేశ్‌నగర్, కోతిరాంపూర్, పెద్దపల్లిరోడ్, కోర్టుచౌరస్తాల్లో పదుల సంఖ్యలో గ్యాస్ రీఫిలి్లంగ్ దుకాణాలున్నాయి. జనావాసాల నడుమ అక్రమ దందా నడుస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీరి అక్రమాలపై నిఘా పెట్టి నియంత్రించాలి్సన సంబంధిత అధికారులు నెలవారీగా నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు పెడుతూ తర్వాత దందా నడిచేలా పరోక్షంగా సహకరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పలు హోంనీడ్స్ దుకాణాలు అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ వ్యాపారానికి అడ్డాగా మారాయి. హైదరాబాద్ నుంచి చిన్న సిలిండర్లు కొనుగోలు చేసి ఇక్కడకు తెచ్చి వ్యాపారం చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో మినీ సిలిండర్లు విక్రయిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు.
రాయితీ గ్యాస్ ధర రూ.766.50 కాగా, వాణిజ్య గ్యాస్ ధర రూ.1500. ఈ సిలిండర్లను వినియోగదారులు, ఏజెన్సీ నిర్వాహకుల సాయంతో కొనుగోలు చేసి రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గోదాంలకు తరలిస్తున్నారు. మరికొందరు దుకాణాల్లోనే వెనుక వైపు మినీ సిలిండర్లలో రీఫిలి్లంగ్ చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాలకు వీటిని తరలించి పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. మధ్య తరగతి ప్రజలు, చిరువ్యాపారులు, పెళ్లికాని ప్రసాదులు, ఉన్నత చదువుల కోసం వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్న విద్యార్థులు మినీ సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీరి అవసరాలను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.766 ఉన్న రాయితీ గ్యాస్ ను గ్యాస్ వినియోగదారుల నుంచి రూ.900 నుంచి రూ. 1000కి కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు 3 లేదా 4 సిలిండర్లలో నింపుతూ రూ.వెయ్యి అదనంగా సంపాదిస్తున్నారు.
జనావాసాల మధ్య వ్యాపారం
జనావాసాల మధ్య అక్రమ దందా నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినీ సిలిండర్లు వాడడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. నిర్వాహకులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న గోదాంలలో గ్యాస్ నింపే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించాలి్సందే. ఇవన్నీ సంబంధిత అధికారులకు తెలిసినా సీరియస్‌గా తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనావాసాల మధ్య కార్లలో గ్యాస్ నింపే దందా కూడా ఎక్కువగా సాగుతోంది. భగత్‌నగర్, కోతిరాంపూర్, మంకమ్మతోట, రాంనగర్, విద్యానగర్, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన పలు గ్యాస్ కంపెనీలు మార్కెట్లో 5కిలోల సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి. వీటిని వినియోగించేందుకు జనం ఆసక్తి చూపడం లేదు. దీనిపై అవగాహన కల్పించాలి్సన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment