టెట్‌ నిర్వహిస్తారా లేదా...? | Suspense On TET Exam In Telangana | Sakshi
Sakshi News home page

టెట్‌ నిర్వహిస్తారా లేదా...?

Published Tue, Dec 15 2020 12:46 AM | Last Updated on Tue, Dec 15 2020 7:30 AM

Suspense On TET Exam In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కోసం 5.5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడితే తమకు టెట్‌ అర్హత ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందే టెట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకొని ఇప్పటివరకు ఆరుసార్లే నిర్వహించారు. వాస్తవానికి 12 సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను 6 సార్లే నిర్వహించడంతో ఇంకా 5.5 లక్షల మంది టెట్‌ కోసం ఎదురు చూస్తు న్నారు. రాష్ట్రంలో 2017 జూలై 23 తర్వాత ఇప్పటి వరకు టెట్‌ నిర్వహించలేదు. తాజాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు..
ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌ (1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు) పరీక్ష రాయాలంటే టెట్‌లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి 2011లో ఆదేశాలు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం మేరకు టెట్‌ను తప్పనిసరి చేసింది. టెట్‌ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా టెట్‌ పేపర్‌–1లో అర్హత సాధిస్తే ఒకటి నుంచి 5వ తరగతి వరకు, పేపర్‌–2లో అర్హత సాధిస్తేనే 6 నుంచి 8వ తరగతి వరకు బోధించవచ్చని పేర్కొంది. టెట్‌లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ, ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ముగిసిన మూడు టెట్‌ల వ్యాలిడిటీ..
ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు 2011 జూలై 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మొదటి టెట్‌ నిర్వహించింది. ఆ తర్వాత 2012 జనవరి 8న రెండో టెట్, 2012 జూన్‌ 1న మూడో టెట్‌ నిర్వహించింది. ప్రస్తుతం ఆ మూడు టెట్‌ల స్కోర్‌కు ఎన్‌సీటీఈ కల్పించిన ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసింది. ఆయా టెట్‌ల పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలకు తెలంగాణ, ఏపీకి చెందిన వారు 15 లక్షల మందికి పైగా హాజరు కాగా, అందులో 7,41,097 మంది అర్హత సాధించారు. అందులో తెలంగాణకు చెందిన అభ్యర్థులు దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. ఏడేళ్ల నిబంధన కారణంగా వారంతా తమ టెట్‌ వ్యాలిడిటీని కోల్పోయారు. ఆ తర్వాత (2014, 2016, 2017లలో) నిర్వహించిన మరో మూడు టెట్‌లలో 3,69,308 మంది అర్హత సాధించారు. 2014 మార్చి 16న నిర్వహించిన నాలుగో టెట్‌లో ఏపీకి చెందిన 70 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారు కాకుండా తెలంగాణ అభ్యర్థులు 3 లక్షల మంది ఆయా టెట్‌లలో అర్హత సాధించారు. అయితే మొదటి మూడు టెట్‌లలో అర్హత కోల్పోయిన వారు ఇందులో దాదాపు 2 లక్షల మంది ఉండగా, మరో లక్ష మంది అర్హులు కాలేకపోయారు. నాలుగో టెట్‌లో అర్హత సాధించని లక్ష మందితో పాటు మరో 3 లక్షల మందికి పైగా పలు టెట్‌లలో అర్హత సాధించని వారు ఉన్నారు. వారికి తోడు 2017 జూలై 23న నిర్వహించిన చివరి టెట్‌ తర్వాతి మూడు విద్యా సంవత్సరాల్లో (2018, 2019, 2020) ఉపాధ్యాయ విద్యా కోర్సులను (బీఎడ్, డీఎడ్‌) పూర్తి చేసుకున్న వారు మరో లక్షన్నర మంది ఉన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్రంలో టెట్‌ కోసం ఇప్పుడు 5.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారంతా టెట్‌లో అర్హత సాధిస్తేనే టీఆర్‌టీ రాసేందుకు అర్హులు అవుతారు.

ఆ లక్ష మందికి ప్రయోజనం చేకూరేనా?
ప్రస్తుతం ఏడేళ్లు మాత్రమే ఉన్న టెట్‌ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని ఇటీవల ఎన్‌సీటీఈ పాలక మండలి నిర్ణయించింది. దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మారుస్తామని స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే దానిపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, మొదటి మూడు టెట్‌లలో అర్హత సాధించినా, తర్వాతి టెట్‌లలో అర్హత సాధించని మరో 1 లక్షల మందికి టెట్‌ గండం వచ్చి పడింది. టెట్‌ వ్యాలిడిటీని శాశ్వతం చేస్తామన్న ఎన్‌సీటీఈ నిర్ణయాన్ని.. గతంలో టెట్‌ అర్హత సాధించిన వారికి కూడా వర్తింపజేస్తే ఆ లక్ష మందికి ప్రయోజనం చేకూరనుంది. లేదంటే వారు కూడా మళ్లీ టెట్‌ రాయాల్సిందే.

వెంటనే టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వండి: రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు
రాష్ట్రంలో వెంటనే టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి పరీక్ష నిర్వహించాలి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో టెట్‌లో అర్హత సాధిస్తేనే అభ్యర్థులకు టీఆర్‌టీ రాసే అర్హత లభిస్తుంది. టెట్‌ కోసం 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.

వ్యాలిడిటీ రద్దయిన టెట్‌ల వివరాలు..
2011 జూలై 1న మొదటి టెట్‌..

పేపర్‌    హాజరు    అర్హులు    అర్హుల శాతం
1    3,05196    1,35,105    44.27    
2    3,34,659    1,66,262    49.68
2012 జనవరి 8 నాటి రెండో టెట్‌..
1    55,194     24,578    44.53
2    4,12,466    1,93,921    47.02
2012 జూన్‌ 1 నాటి మూడో టెట్‌
1    58,123    26,382    45.39
2    4,18,479    1,94,849    46.56.

ప్రస్తుతం వ్యాలిడిటీ ఉన్న మూడు టెట్‌లు..
16–3–2014 – నాలుగో ఏపీ టెట్‌
1    65,770    40,688    61.86
2    4,04,385    1,15,510    28.56
22–5–2016– మొదటి తెలంగాణ టెట్‌
1    88,661    48,278    54.45
2    2,51,906    63,079    25.04
23–7–2017– రెండో తెలంగాణ టెట్‌
1    98,848    56,708    57.37
2    2,30,932    45,045    19.51

––––––––––––––––––––––
22–5–2016 కానీ జనవరి 24న పరీక్ష జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement