సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన టెక్నాలజీ యాక్సలేటర్ ‘ఫాల్కన్ ఎక్స్’ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో నిర్వహించనున్న గ్లోబల్ స్టార్టప్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ (ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌ల సమ్మేళనం)లో రాష్ట్రానికి చెందిన టీ–హబ్ భాగం పంచుకోనుంది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్‌లో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలనుకొనే భారతీయ అంకుర సంస్థలు పాల్గొనాలని ఆహ్వానించింది. అత్యంత ప్రభావం చూపగలిగే స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు, కొత్త మార్కెట్లలో ప్రత్యేకించి అమెరికాలో ఆయా స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని పేర్కొంది.
జూలైలో మొదలయ్యే ఈ కార్యక్రమం 5 వారాలపాటు కొనసాగనుంది. వందకుపైగా వెంచర్ క్యాపిటలిస్టులు, కార్పొరేట్ కంపెనీలు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపుతుండగా మూడు అత్యుత్తమ స్టార్టప్‌లకు లక్ష అమెరికన్ డాలర్ల చొప్పున ఫాల్కన్ ఎక్స్ నిధులు అందించనుంది. స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఫాల్కన్–ఎక్స్‌తో కుదిరిన భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్‌రావు తెలిపారు. ప్రపంచ స్టార్టప్ రంగంలో భారతీయ స్టార్టప్‌లకు శరవేగంగా గుర్తింపు లభిస్తోందని ఫాల్కన్–ఎక్స్ సహ వ్యవస్థాపకుడు మురళి చీరాల అన్నారు. టెక్నాలజీ నిపుణులు, పెట్టుబడిదారులైన బీవీ జగదీశ్, రాజిరెడ్డి, ఆశుగుప్తా, ప్రదీప్ ఆస్వాని, ప్రవీణ్ అక్కిరాజు తదితరులు ఫాల్కన్–ఎక్స్‌లో మురళి చీరాలతో కలిసి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు.
ఫాల్కన్ ఎక్స్‌తో ‘టీ–హబ్’ భాగస్వామ్యం
Published Fri, May 20 2022 1:51 AM | Last Updated on Fri, May 20 2022 1:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment