
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీపడే స్థాయికి తీసుకొస్తామని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అనేక సమస్యలను రాబోయే రెండేళ్లలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. శనివారం పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ‘మన బస్తీ– మన బడి’పై హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తలసాని మాట్లాడుతూ, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు మంచి విద్యను అందించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలకు నిధులను సీఎం కేటాయించారని, త్వరగా సమస్యలను పరిష్కరించాలని, ఇంగ్లిష్ మీడియంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ఆయా పాఠశాలలను సందర్శిస్తూ సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఫీజులపై ప్రైవేటు స్కూళ్లలో ఒత్తిడి చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీసుకువస్తామని, అప్పుడు ప్రైవేటుకు వెళ్లేవారు తగ్గుతారని తలసాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment