యువ సారథ్యానికి అవకాశం | TBGKS leaders meeting with Kavitha on Singareni election | Sakshi
Sakshi News home page

యువ సారథ్యానికి అవకాశం

Published Thu, Dec 7 2023 12:37 AM | Last Updated on Thu, Dec 7 2023 12:37 AM

TBGKS leaders meeting with Kavitha on Singareni election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కా ర్మి క సంఘం (టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య బుధవారం హైదరాబాద్‌లో కవితను కలసి సింగరేణి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధతపై చర్చించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తమ యూనియన్‌లో యువతకు 66 శాతం వరకు నాయకత్వ బాధ్యతల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. 1998లో ఆగిపోయిన కారుణ్య నియామకాలను 2018లో కేసీఆర్‌ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారన్నారు. జాతీయ సంఘాల కారణంగా కారుణ్య నియామకాలకు గండి పడిందని, కోల్‌ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.

సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ దాదాపు 20 వేల డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని, ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని వివరించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచామని, తెలంగాణ ఉద్యమ సమయంలో 35 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న వారికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ పూర్తి జీతం ఇచ్చారని గుర్తు చేశారు.

కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించారని, క్వార్టర్స్‌లో నివసించే వారు బేసిక్‌లో 1% సంస్థకు చెల్లించాలన్న నిబంధనను కేసీఆర్‌ రద్దు చేశారని, డిపెండెంట్‌ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలన్న నిర్ణయం తీసుకున్నారని కవిత పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement