సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల విభజన, సీనియారిటీ ప్రక్రియ మంటలు రేపుతోంది. జిల్లా కేటాయింపులు, ఆప్షన్లలో హేతుబద్ధత లోపించిందని... భజనపరులు, పైరవీకారులకే సీనియారిటీ జాబితాలో చోటు లభించిందని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద టీచర్లు ధర్నా చేయడంతోపాటు కలెక్టర్‌ను కాసేపు అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు.
వరంగల్ కలెక్టరేట్‌లోనూ టీచర్లు నిరసన గళం వినిపించారు. సీనియారిటీకి చెల్లుచీటీ ఇచ్చి అడ్డగోలుగా విభజన చేశారని మండిపడ్డారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలసి క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు.
సమగ్ర పరిశీలన తర్వాతే జాబితా ప్రకటించాలని కోరారు. మరోవైపు సంఘాల ప్రతినిధులతో మంగళవారం చర్చలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన అంగీకరించారు. ఈ నేపథ్యంలో విభజన ప్రక్రియలో జాప్యం అనివార్యమని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
ఇదీ జరిగింది...
♦వాస్తవానికి కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన ప్రక్రియ సోమవారంతో పూర్తై కేటాయింపుల ఉత్తర్వులు సైతం సోమవారమే వెలువడాల్సి ఉంది. అయితే ఒకట్రెండు జిల్లాలు మినహా మిగతా చోట్ల ఎక్కడా సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.
కానీ కేటాయింపు జాబితా అన్ని చోట్లా ఉద్యోగులకు తెలిసిపోయింది. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం సీనియారిటీ అంశమే తీవ్ర వివాదమైంది. జాబితాలో జూనియర్లు కూడా ముందు వరుసలో ఉన్నట్లు తేలడంతో టీచర్లు ఇప్పుడివి సరిచేయకుంటే తాము శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
అధికారుల వల్లే తప్పులు...
హడావుడిగా విభజన చేయడంలో అధికారులు పొరపాట్లు చేశారు. ఉద్యోగంలో చేరిన తేదీ, పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకున్నారు. ర్యాంకు రికార్డును పరిగణనలోకి తీసుకొని ఉంటే న్యాయం జరిగేది. ఉద్యోగులు ఎప్పుడు, ఏ ర్యాంకులో కొనసాగారనేదే అసలైన సీనియారిటీ. ఈ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా హడావిడిగా విభజన ప్రక్రియ చేపట్టడం వల్లే జాబితాలు తప్పులతడకగా మారాయి.
– చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
ఇదీ బాధితుల వాదన..
♦వరంగల్ జిల్లాకు చెందిన తూహిద బేగంకు సీనియారిటీ ఉంది. కానీ తనకన్నా జూనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని ఆమె తెలిపింది. తనను ములుగు జిల్లాకు బదిలీ చేశారని ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లాలో పనిచేస్తున్న అనిత సీనియారిటీలో రెండో స్థానం. కానీ ఆమెకన్నా తక్కువ సీనియారిటీ ఉన్న మరో టీచర్ జాబితాలో రెండో స్థానంలో ఉంది.
♦హన్మకొండ జిల్లాకు చెందిన పి శంకర్ ఎస్సీ ప్రాధాన్యత క్రమంలో జయశంకర్ భూపాలపల్లి వస్తుందని ఆశించాడు. సీనియారిటీ ప్రకారం ఇది సాధ్యమేనని చెబుతున్నాడు. కానీ ఇప్పుడు తనకన్నా జూనియర్‌కు ఈ స్థానం కేటాయించారని తెలిపాడు. భూపాలపల్లికి చెందిన మహేందర్ సీనియారిటీ ఉన్నా... అతన్ని సిద్ధిపేటకు కేటాయించారు. తనకన్నా జూనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించాడు.
♦కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న టి సరిత భర్త ములుగు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి. ఈ కారణంగా తనను ములుగుకు పంపాలని ఆప్షన్ ఇచ్చింది. తనకన్నా జూనియర్‌కు ఆ స్థానం ఇచ్చి, తనకు అన్యాయం చేశారని ఆమె ఖమ్మం కలెక్టర్ వద్ద మొరపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment