గ్రేటర్ జిల్లాల్లో టీనేజర్లు కోవిడ్ టీకా తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి ఈ నెల 3 నుంచి ప్రత్యేక వ్యాక్సినేషన్ చేపట్టగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 20 శాతం మంది టీనేజర్లు కూడా టీకా వేసుకోలేదు. ఒకవైపు కోవిడ్ కేసులు పెరుగుతుండగా..మరోవైపు టీకా వేసుకునేందుకు ముందుకు రాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది
సాక్షి హైదరాబాద్: తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ జిల్లాల్లోనే ఎక్కువ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అనేక మంది దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా టీకాలు వేసుకుని ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలువాల్సిన వారు వైరస్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు. కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవడంలోనే కాదు...టీకాలు వేసుకునేందుకు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. టీనేజర్లకు టీకాలు వేసే విషయంలో నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి వరుస స్థానాల్లో నిలవగా..22వ స్థానంలో హైదరాబాద్, 26వ స్థానంలో మేడ్చల్, 29వ స్థానంలో రంగారెడ్డి జిల్లాలు నిలవడం, మిగతా జిల్లాలతో పోలిస్తే రాజధాని జిల్లాలు వెనుకబడి పోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ...టీకా వేసుకుంటే జ్వరం, ఒంటి నొప్పులు వంటి కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే అపోహతో తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించకపోవడం కూడా టీకాల్లో వెనుకబడి పోవడానికి కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వేసుకుంటారా..? వెనుకాడుతారా...?
- కోవిడ్ నియంత్రణలో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ డోసు టీకాల విషయంలో ఆశించిన దానికంటే అధికశాతం వ్యాక్సినేషన్ పూర్తైంది. ఈ విషయంలో ఇతర జిల్లాలకు గ్రేటర్ జిల్లాలు మార్గదర్శకంగా నిలిచాయి. అయితే టీనేజర్లకు టీకాలు వేసే విషయంలో మాత్రం బాగా వెనుకబడ్డాయి.
- 15 నుంచి 17 ఏళ్లలోపు వారికి ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి కోవాగ్జిన్ టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 1,84,822 మంది ఉన్నట్లు గుర్తించి, శుక్రవారం రోజు నాటికి 55,347 మందికి టీకాలు వేశారు.
- మేడ్చల్ జిల్లాలో 1,65,618 మంది లబ్ధిదారులు ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 46,970 మందికి టీకాలు వేశారు.
- రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మంది టీనేజర్లు ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 35,104 మందికి మాత్రమే టీకాలు వేశారు.
- ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు శనివారం నుంచి ఈ నెల 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు కాలేజీలు, విద్యాసంస్థల్లో టీకాలు వేస్తున్నప్పటికీ చాలా మంది ఆసక్తి చూపడం లేదు. సాధారణ రోజుల్లోనే ఆసక్తి చూపని వారు సెలవుల్లో స్వయంగా ఆరోగ్య కేంద్రాలకు చేరుకుని టీకాలు వేసుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఒక్కరోజే 1902 కేసులు
గ్రేటర్ జిల్లాల్లో కోవిడ్ కేసులు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1452 కేసులు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాల్లో 232 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాల్లో 218 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఈ సంఖ్య 1902కు చేరడం గమనార్హం. ఒక వైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా..సిటిజన్లు వైరస్‌ను లైట్‌గా తీసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మాస్క్‌లు లేకుండా హోటళ్లు, షాపింగ్‌మాల్స్, మార్కెట్ల చుట్టూ తిరుగుతున్నారు. విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారు.
పెరుగుతున్న తీవ్రత
ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరిస్తుండటం, కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురై...ఆస్పత్రుల్లో చేరుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1318 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 373 మంది ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతుండగా, 945 మంది ఐసీయూ, వెంటిలేటర్ పడకలపై చికిత్స పొందుతుండటం గమనార్హం. కేసులు మరింత పెరుగుతుండటంతో నగరంలోని గాంధీ, టిమ్స్ సహా కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతి ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రుల్లో వైద్యులు అ ప్రమత్తమయ్యారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలను సమకూర్చడంతో పాటు అవసరమైన ఆక్సిజన్ నిల్వలు ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుం టున్నారు.
Comments
Please login to add a commentAdd a comment