సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీలు మూడు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. పెంచిన జీతం సంగతేమోకానీ, ఉన్న జీతమైనా నెలనెలా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా ఐదో తేదీలోగా జీతాలు చేతికి అందేవి. దీంతో గత మూడు నెలలుగా ప్రతినెలా ఐదోతేదీ ఎప్పుడొస్తుందా.. అని ఎదురుచూడటం, ఆ తర్వాత ఉస్సూరమనడం అంగన్‌వాడీల వంతైంది. పెంచిన జీతాలకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద అపరిష్కృతంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.
వరుసగా మూడు నెలలు నిలిచిపోవడంతో గృహావసరాలు తీర్చుకోలేక తాము ఇబ్బందులు పడుతున్నామని అంగన్‌వాడీలు చెబుతున్నారు. కాస్త ఆలస్యమైనా వేతనాలను నెలవారీగా ఇవ్వాలని టీచర్లు, హెల్పర్ల సంఘాలు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి.
ఇందులో 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3.989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉండగా, మినీకేంద్రాల్లో ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ఖాళీలు మినహాయిస్తే రాష్ట్రంలో 58 వేలమంది టీచర్లు, హెల్పర్లు విధులు నిర్వహిస్తున్నారు.
కొత్తవేతనాల అమలుతో లింకు...
ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలను ప్రభుత్వం పెంచింది. అంగన్‌వాడీ టీచర్‌కు రూ.10,500 నుంచి రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్, హెల్పర్‌కు రూ.6,000 నుంచి రూ.7,800కు పెంచగా, వీటిని జూలై నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఆగస్టులో జారీ చేసినప్పటికీ, ఇంకా అమల్లోకి రాలేదు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత నుంచి అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందలేదని తెలుస్తోంది.
కొత్త వేతనాల అమలుకు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, అందువల్లే వేతనాల విడుదలలో జాప్యమవుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక సమస్యను అధిగమించి బకాయిలతోపాటు ప్రస్తుత వేతనాలను వచ్చే నెలలో ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment