సాక్షి, హైదరాబాద్: ఒక లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని.. అందువల్ల తాను టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సిట్‌కు లేఖ రాశారు. వాస్తవానికి తనకు సిట్ ఆఫీస్ నుంచి నేరుగా ఎలాంటి నోటీసులు అందలేదని, వాటిలో ఏముందో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. సిట్ నోటీసులు జారీ చేసినట్టు మీడియా వార్తల ద్వారా తన దృష్టికి రావడంతో లేఖ రూపంలో స్పందిస్తున్నట్టు వివరించారు. ‘‘టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ఆ«దీనంలోని సిట్ జరుపుతున్న విచారణపై మాకు నమ్మకం లేదని పేపర్ లీకేజీ స్కాం బయటపడిన నాటి నుంచీ చెప్తున్నాం.
అధికార పీఠానికి దగ్గరగా ఉన్న వారి అండదండలు లేకుండా ఇలాంటివి జరిగే అవకాశం లేదని మేం నమ్ముతున్నాం. ఈ కేసులో హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మేం గట్టిగా నమ్ముతున్నందున.. సిట్ ఏర్పాటే సరైంది కాదని భావిస్తున్నాం. సిట్‌పై ఎలాంటి విశ్వాసం, నమ్మకం లేనప్పుడు పేపర్ లీకేజీకి సంబంధించి మా వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకునే విషయమే ఉత్పన్నం కాదు. అందువల్ల నమ్మకమున్న విచారణ లేదా దర్యాప్తు సంస్థలకే సమాచారాన్ని చేరవేసే మా హక్కును ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం..’’అని సిట్‌కు రాసిన లేఖలో సంజయ్ పేర్కొన్నారు.
రావాలంటే.. హాజరవుతా..
ఈ అంశంలో తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను సిట్ అధికారుల ఎదుట హాజరుకావాలని విచారణ సంస్థ భావిస్తే.. వచ్చేందుకు సుముఖంగానే ఉన్నానని పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ తేదీని తెలియజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment