సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఓటింగ్ సరళి, వివిధ వర్గాల ఓటర్ల స్పందనను బట్టి బీజేపీదే గెలుపు అని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు న్నారు. పెరిగిన ఓటింగ్ శాతం, సాయంత్రం దాకా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెల్లువెత్తడం వంటివి తమకు అనుకూలమని అంచనా వేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా జరిగిన నిశ్శబ్ద ఓటింగ్ తమను గెలిపిస్తుందని అంటున్నారు.
మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను కట్టడి చేసేందుకు బుధవారం అర్థరాత్రి నుంచి అనుసరించిన ఎదురు దాడి వ్యూహం.. పోలీసులు, ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి అధికార పార్టీ నేతలను కట్టడి చేయడం మంచి ఫలితాలను ఇచ్చాయని పేర్కొంటున్నారు. పోలింగ్‌కు ముందు నుంచే టీఆర్‌ఎస్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, ఎన్నికల అక్రమాలకు పాల్ప డుతోందనే ప్రచారంతో అధికార పార్టీని నిలువరించగలిగామని.. బీజేపీ చేపట్టిన కార్యాచరణకు విస్తృతంగా ప్రచారం రావడంతో మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు.
యువత వెల్లువెత్తడం అనుకూలమే..
గురువారం పోలింగ్ సందర్భంగా ఉదయం నుంచే తమ కుటుంబసభ్యులు, ఇతర వర్గాల వారిని ఓటింగ్‌కు వచ్చేలా ప్రోత్సాహంలో యువత కీలకపాత్ర పోషించిందని బీజేపీ నేతలు అంటున్నారు. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ బూత్‌లకు యువ ఓటర్లు వెల్లువలా వచ్చి ఓటేయడం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో అధిక ఓట్లు ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండలం పరిధిలో బీజేపీ ప్రభావం బాగా కనిపించిందని.. ఇక్కడ మెజారిటీ ఓట్లు బీజేపీకి అనుకూలంగా పడ్డాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఎల్‌బీనగర్, వనస్థలిపురం తదితర నగర శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మునుగోడు ఓటర్ల మొగ్గు బీజేపీవైపే ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఓటింగ్ సరళిపై పరిశీలన
గురువారం ఉదయం ఓటింగ్ మొదలైనప్పటి నుంచి రాత్రి ముగిసేదాకా పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు ఓటింగ్ సరళిని పరిశీలించారు. మునుగోడులోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఓట్లు పడుతున్న తీరు, గంటకు గంటకు నమోదైన ఓటింగ్ శాతం, ఏయే వర్గాలవారు అధికంగా ఓటింగ్‌కు వస్తున్నా రన్న అంశాలపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకున్నారు. వాటికి అనుగుణంగా గ్రామాలు, మండల స్థాయిల్లో తమ పార్టీ నాయ కులు, కార్యకర్తలను అప్రమత్తం చేశారు. పార్టీకి పట్టున్న గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజలు పోలింగ్‌బూత్‌లకు చేరుకునేలా సమన్వయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment