సాక్షి, హైదరాబాద్: నల్ల బంగారానికి నెలవైన సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేటీకరిస్తోందంటూ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణి ఎన్నికలు వస్తుండటంతోనే కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రచారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు తాను కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి లేఖ రాశానని.. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు.
కేంద్రమంత్రి ఇచ్చిన వివరణ లేఖను బండి సంజయ్ ఆదివారం విడుదల చేసి మాట్లాడారు. ‘సింగరేణిలో అత్యధికంగా 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని.. కేంద్ర వాటా 49 శాతం మాత్రమేనని ప్రహ్లాద్‌జోషి వివరించారు. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం అసాధ్యమని చెప్పారు. కేంద్రం మైన్స్ అండ్ మినరల్ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్ యాక్ట్–2015 ప్రకారం కోల్‌బ్లాకులను పారదర్శకంగా వేలం వేయాలని చట్టం చేసిందని.. దాని ప్రకారం యాక్షన్ వేలం ద్వారా కేటాయించాలనే నిబంధన ఉందని వివరించారు.
2020లో కమర్షియల్ మైనింగ్ అనే అంశాన్ని చట్టంలో చేర్చడం వల్ల నాటి నుండి వేలం ద్వారా మాత్రమే బొగ్గు బ్లాకులను కేటాయిస్తున్నారని.. సింగరేణికి చెందిన 4 బ్లాకు లను వేలం వేస్తే ఎవరూ బిడ్లు వేయలేదని వివరించారు. ఆ బ్లాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే వేలం ద్వారా సింగరేణి సంస్థ పొందవచ్చు’ అని సంజయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment