సాగుకు యంత్ర సాయం | Telangana Budget 2021 Allocation For Agriculture | Sakshi
Sakshi News home page

సాగుకుయంత్ర సాయం

Published Fri, Mar 19 2021 8:09 AM | Last Updated on Fri, Mar 19 2021 8:09 AM

Telangana Budget 2021 Allocation For Agriculture - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దుక్కి ఉంటేనే దిక్కు ఉంటుంది.నాగలి సాగితేనే ఆకలి తీరుతుంది. ఇది ముమ్మాటికీ నిజం.ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదనిఈసడించుకున్న వాళ్లే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్షపడే విధంగా వ్యవసాయ రంగంలో మనం అపూర్వమైన ప్రగతిని సాధించగలిగాం.  – హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ యాంత్రీకరణపై సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా రూ. 1,500 కోట్లు బడ్జెట్లో కేటాయించడం విశేషం. ఒకవైపు కూలీల కొరత ఉండటం, ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయడంలో కేంద్రం ఆసక్తి చూపించకపోవడంతో తెలంగాణ సర్కారు యాంత్రీకరణకు మొగ్గు చూపింది. భారీ కేటాయింపులతో రైతులను యాంత్రీకరణ బాటపట్టించేందుకు రంగం సిద్ధం చేసింది. గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.951 కోట్లు ఖర్చు చేసి 14,644 ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందించింది. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఈసారి రూ. 25 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. రైతు బంధు, రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుబీమా పథకాలకే ఎక్కువగా నిధులు కేటాయించింది.

అవి పోగా మిగిలిన వాటికి రూ.2,276 కోట్లు కేటాయిం పులు చేసింది. ఇక వ్యవసాయ భూములు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందేలా ‘రైతు బంధు’పథకానికి తాజా బడ్జెట్‌లో రూ.14,800 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు పెట్టగా... రూ.14,736 కోట్లు అవసరమయ్యాయి. కేటాయిం పుల కంటే రూ. 736 కోట్లు అధికంగా విడుదల చేయాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నిధులు పెంచింది. గత బడ్జెట్‌ కేటాయిం పుల్లో రెండు సీజన్లలో 59.25 లక్షల మంది రైతులకు సొమ్ము వారి ఖాతాల్లో వేసింది. ఈసారి సాగు, పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా రూ. 14,800 కోట్లు కేటాయించారు. ఇక రైతు రుణాల మాఫీ కోసం ఈ బడ్జెట్‌లో రూ. 5,225 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ.6,225 కోట్లు కేటాయించినా... రూ. 25 వేల లోపు రుణాలు మాఫీ చేసేందుకు రూ.1,210 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 

రైతు బీమాకు రూ. 1,200 కోట్లు
రైతు బీమా పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయించారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం అందించడానికి బీమా కల్పించారు. గత ఏడాది బడ్జెట్‌లో రూ.1,141.4 కోట్లు మంజూరు చేసి 32.73 లక్షల మందికి బీమా కల్పించారు. ఈ ఏడాది కొంత పెంచారు. ప్రతి రైతుకు ప్రీమియంగా రూ. 3,400 చొప్పున ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లిస్తుంది. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న రైతులు... ఈ బీమాకు అర్హులు. 2018 నుంచి ఇప్పటివరకు రైతు బీమా పథకం ద్వారా 46,564 రైతు కుటుంబాలకు రూ.2,328 కోట్లు పరిహారం అందించింది.

వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు బడ్జెట్‌లో రూ.122 కోట్లు కేటాయించింది. గతంలో కేవలం మార్కెట్‌ సెస్‌ ద్వారా మార్కెట్‌లు నడిచేవి. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలతో మార్కెటింగ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు నిధుల కేటాయింపు చేయడం గమనార్హం. కూరగాయలు, మాంసం, చేపలు... అన్ని ఒకేచోట వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల కోసం రూ. 500 కోట్లు కేటాయించింది. గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ సక్సెస్‌ కావడంతో రాష్ట్రంలో మరిన్ని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు నిధుల కేటాయింపు చేసింది. రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రకటించారు.

ఆయిల్‌ పామ్‌సాగుకు ఎకరాకు రూ.30 వేల సబ్సిడీ
రైతు బంధు, రైతు బీమా పథకాలు కొనసాగిస్తూనే వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1,500 కోట్లు కేటాయించడం హర్షణీయం. కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్నది. వ్యవసాయంలో యాంత్రీకరణ అత్యవసరం. అందుకే కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రతిపాదింపజేశారు. 8.14 లక్షల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ విస్తరణ కోసం రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ. 30 వేల సబ్సిడీని రైతులకు ఇచ్చేందుకు బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వృద్ధి రేటుకు వ్యవ‘సాయం’ 
ప్రాథమిక రంగమైన.. వ్యవసాయం, అనుబంధ రంగాల పనితీరు వల్ల గతేడాది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జాతీయ స్థాయి కన్నా మెరుగైన స్థితిలో నిలిచింది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల గ్రాస్‌ స్టేట్‌ వాల్యూ యాడెడ్‌ (జీఎస్‌వీఏ) 20.9 శాతం వృద్ధి సాధించింది. జాతీయ స్థాయిలో ఈ రంగాల జీఎస్‌వీ వృద్ధి 3 శాతమే. ద్వితీయ రంగమైన.. పారిశ్రామిక రంగ వృద్ధి రేటు మైనస్‌ 5.6 శాతం, తృతీయ రంగంలో సేవల రంగంలో వృద్ధి రేటు మైనస్‌ 4.9 శాతానికి పతనమాయ్యయి. అయితే, జాతీయ స్థాయితో పోలిస్తే కొంత మేర మెరుగైన స్థితిలో ఉన్నాయి. దేశంలో పరిశ్రమల రంగంలో వృద్ధి రేటు మైనస్‌ 8.2 శాతానికి, సేవల రంగంలో వృద్ధి రేటు మైనస్‌ 8.1 శాతానికి పతనమైంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement